క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టును ఆసీస్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వరుసగా వికెట్లు తీస్తూ భారత్ బ్యాట్స్‌మెన్లను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. దీంతో స్వల్పస్కోరుకే భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
శుభమన్ గిల్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలో దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో వైపు గిల్ (4) కుదురుకునే క్రమంలో ఓ చెత్త షాట్ ఆడి క్యాచ్‌గా వెనుదిరిగాడు. కింగ్ కోహ్లీతో కలిసి రోహిత్ మంచి భాగస్వామ్యం నెలకొల్పుతాడని అంతా అనుకుంటున్న సమయంలో మాక్స్‌వెల్ వేసిన స్పిన్‌కు రోహిత్ (4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) బలయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (4) కూడా వెంటనే వెనుదిరగడంతో.. టీమిండియా కష్టాల్లో పడింది. అయితే కె.ఎల్. రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
ఒకానొక దశలో 90 బంతుల వరకు ఒక్క ఫోర్ కూడా పడలేదంటే.. వీరిద్దరూ వికెట్ నిలుపుకోవడం కోసం ఎంత ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా ఆడే క్రమంలో కోహ్లీ (54) అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం మళ్లీ ప్రారంభమైంది. రవింద్ర జడేజా (9) వెంటనే అవుట్ అవ్వగా.. కాసేపటికే నిలకడగా ఆడుతున్న రాహుల్ (66) క్యాచ్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ (18), షమీ (6), బుమ్రా (1) వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. చివరి బంతికి రెండు పరుగులు చేసే క్రమంలో కుల్‌దీప్ రనౌట్ అయ్యాడు. దీంతో 50 ఓవర్లలో 240 పరుగులకు ఇండియా ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీసుకోగా.. హేజల్ వుడ్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. మ్యాక్స్‌వెల్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించాలంటే టీమిండియా బౌలర్లు రాణించాలి. ఇప్పుడు భారమంతా బౌలర్లదే.. ఏం చేస్తారో చూడాలి.