తెలంగాణలో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. మేనిఫెస్టోల పేరుతో సామాన్య ప్రజానీకంపై పెద్ద ఎత్తున వరాలు కురిపిస్తున్నారు. ఆ హామీలన్నీ అమలు చేస్తే రాష్ట్ర ఖజానా పాతాళానికి వెళ్లాల్సిందే. మరి సామాన్య ప్రజానీకానికి ఈ విషయం అర్థమవుతుందా? అంతలా ఆలోచించగలరా? అసలు ఈ రాజకీయ పార్టీలు గుప్పించే హామీలతో బాగుపడేది నిజంగా సామాన్యులేనా? మితిమీరితే ఏదైనా అనర్థమే. ముఖ్యంగా ఈ మితిమీరిన హామీలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. తద్వారా అంతిమంగా ఇబ్బంది పడేదెవరు? రాష్ట్ర ప్రజానీకం కాదా? తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలదీ ఇదే దారి.
అసలు ఎన్ని కుటుంబాలున్నాయి?
అసలు ఈ సంక్షేమ పథకాల కారణంగా ఓట్లు రాలుతున్నాయి కాబట్టే ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కాదు.. దేశంలోని రాష్ట్రాలన్నీ ఇదే పని చేస్తున్నాయి. హామీలేమో ఆకాశాన్నంటుతున్నాయి.. రాష్ట్ర ఖజానాయేమో పాతాళానికి చేరుకుంటోంది. అయినా సరే.. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తపనతో ఇష్టానుసారంగా హామీలను గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ హామీల విషయానికి వస్తే.. ఒక్కో దళిత కుటుంబానికి ఏడాదికి 12 లక్షల నగదు సాయం అందిస్తుందట. అసలు ఎన్ని కుటుంబాలున్నాయి? ఒక్కో కుటుంబానికి చొప్పున రూ.12 లక్షల సాయమంటే.. ఎంత అందుతుంది? రైతు బంధు 10 వేల నుంచి 16 వేలకు పెంచుతారట. కానీ రాష్ట్రంలో వందల ఎకరాలున్న వారు కూడా ఉన్నారు. మరి ఓ లెక్కా పత్రం అంటూ ఉండొద్దా?
అంతిమంగా ఇబ్బంది పడేదెవరు?
18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు రూ.3 వేలపెన్షన్ అమలు చేస్తారట. ఇది మరీ దారుణం. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన మహిళలు ఎందరున్నారు? రూ.3 వేల చొప్పున అంటే నెలకు ఎంతవుతుంది? ఏడాదికి ఎంతవుతుంది? ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. మరి కర్ణాటకలో చూశారు కదా. ఇది ఐదేళ్ల పాటు అమలు సాధ్యమవుతుందా? మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఆర్థిక సాయమట. ఎంతవుతుంది? ఏంటి? యువ వికాసం పేరుతో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా అట. ఏంటిది? ఎవడి సొమ్ము ఇది? చివరకు జనాలపై పన్నుల రూపంలో మోపడమే కదా? అంతిమంగా ఇబ్బంది పడేదెవరు? బీజేపీ కూడా దీనికి భిన్నంగా ఏమీ హామీలు గుప్పించడం లేదు. ఇంతకు మించి గుప్పిస్తోంది. శ్రీలంక ఉదంతాన్ని చూసి కూడా తెలుసుకోకపోతే ఎలా? సంక్షేమం కాదు.. పని చూపించండి. వారికి బతికే దారి చూపించండి. సోమరిపోతుల్ని చేయడమేంటి? అని మేథావి వర్గమంతా ప్రశ్నిస్తోంది.