ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. రాష్ట్రంలో రాజధాని అనేది ఉందా? లేదా? తెలియదు. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియదు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదలవుతాయో లేదో తెలియదు.. పోనీ ప్రైవేటుగా ఏమైనా చేసుకుందామా? అంటే ఒక్క పరిశ్రమ కూడా వస్తున్న దాఖలాలు లేవు. వచ్చిన వాటన్నింటినీ ప్రభుత్వం కావాలనో.. వద్దనో తెలంగాణకు తరలిస్తోంది. అలా పోయిన వాటిలో లూలూ మాల్ ఒకటి. తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. తద్వారా వందల మందికి ఉద్యోగాలొచ్చాయి. ఇక ఏపీలో ఉండి చేసేదేమీ లేక తట్టా బుట్టా సర్దుకుని ఏపీలోని జనమంతా తెలంగాణకు పయనమవుతున్నారు.
గుర్తుకు తెప్పిస్తున్న శ్రీమంతుడు సీన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత నాలుగేళ్ళుగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. దీంతో నిరుద్యోగులంతా హైదరాబాద్‌కు తరలి వెళ్లి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని అక్కడే స్థిరపడుతున్నారు. ఇక పిల్లలు వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారు కూడా మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్‌కు వెళ్లి ఏదో ఒక పని చేసుకుని బతికేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే శ్రీమంతుడు సినిమాలో పల్లె నుంచి సిటీకి తరలి వెళ్లే వారే కానీ సిటీకి నుంచి తిరిగి వచ్చేవారు ఒక్కరూ కనిపించరు. అదే సీన్ గుర్తొస్తోంది. జగన్ ప్రభుత్వం మారి వేరొక ప్రభుత్వం వచ్చి.. ఉద్యోగ నోటిఫికేషన్స్, పరిశ్రమలను రాష్ట్రానికి తెప్పిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. సరే.. జనాలు కాబట్టి ఉపాధి వెదుక్కుంటూ వెళ్లిపోయారు. తాజాగా ఓ స్వామిజీ సైతం వెళ్లిపోతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
విశాఖలో ఇదే నా చివరి పుట్టినరోజు..
ఆయన మరెవరో కాదు.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎంతగానో అభిమానించే విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. స్వామీజీ నిన్న తన 59వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇదే తన చివరి పుట్టినరోజని.. వచ్చే ఏడాది హైదరాబాద్ కోకాపేటలోని శారదాపీఠంలో ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో తన షష్టిపూర్తి జరుపుకొంటానన్నారు. ఆదిశంకరుల అద్వైత తత్వంపై పరిశోధనలు చేస్తూ అక్కడే తన శేష జీవితాన్ని గడుపుతానన్నారు. భక్తులను టచ్ కూడా చేయని స్వామిజీ క్రిస్టియానిటీని స్వీకరించని జగన్‌ను మాత్రం అప్యాయంగా దగ్గరకు తీసుకుంటారు. వారిద్దరి మధ్య మంచి గురుశిష్యుల అనుబంధం ఉంది. అలాంటి స్వామీజీ రాష్ట్రాన్ని వీడటం షాకింగ్‌గా మారింది. దీంతో ఏపీ రాజకీయాలను భరించలేక స్వామిజీ హైదరాబాద్ వెళ్లిపోతున్నారా? లేదంటే మరొక కారణం ఏదైనా ఉందా? అనే చర్చ ఏపీలో జరుగుతోంది.