మరికాసేపట్లో ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. అతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు నువ్వా నేనా? అనే రేంజ్‌లో తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచి మూడోసారి ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకోవాలని భారత్, ఆరోసారి కప్ గెలవాలని ఆస్ట్రేలియా జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఎవ్వరూ తగ్గేదేలే అనే రేంజ్‌లో ఫైర్ మీదున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆడే ఇరు జట్ల బలాబలాలు, బలహీనతలు ఏంటి? కప్ కొట్టే సత్తా ఏ జట్టుకి ఎక్కువగా అవకాశం ఉందనే దానిపై ఓ లుక్ వేద్దాం..
ముందుగా బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఇరు జట్ల ఓపెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాలనిస్తున్నారు. పవర్ ప్లేలో హిట్‌మ్యాన్ విధ్వంసమే సృష్టిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ కూడా ఫామ్‌లో ఉంటూ జట్టుకు మంచి ఆరంభాలనిస్తున్నారు. డేవిడ్ వార్నర్, హెడ్ ఇద్దరూ ఇద్దరూ అన్నట్లుగా ఇప్పటి వరకు ఆడుతూ వస్తున్నారు. ముఖ్యంగా భారత్‌కు రోహిత్, ఆసీస్‌కు వార్నర్ ప్రధానంగా నిలవనున్నారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో రోహిత్ 550 పరుగులు, వార్నర్ 528 పరుగులు చేశారంటే.. వారి ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వన్‌డౌన్‌కి వస్తే భారత్ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 711 పరుగులతో టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు. మరోసారి కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ పడితే మాత్రం భారత్‌కు తిరుగే లేదు. అలాంటి ఫామ్‌లో కోహ్లీ ఉన్నాడు. ఆస్ట్రేలియాలో వన్‌డౌన్ బ్యాటింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మూడో స్థానంలో వచ్చే మిచెల్ మార్ష్ అంతగా ఫామ్‌లో లేడనే చెప్పుకోవాలి. సెమీస్‌లోనూ డకౌట్‌గా వెనుతిరిగాడు కాబట్టి ఈ మ్యాచ్‌లో కసిగా ఆడాలని ప్రయత్నం చేయవచ్చు. అతను చెలరేగితే ఆసీస్ భారీ స్కోర్ చేయడం ఖాయం. మిడిలార్డర్‌లో భారత్‌కు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరిలో సూర్యకుమార్‌కు ఇంత వరకు భారీ ఇన్నింగ్స్ పడలేదు. కానీ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతూ.. జట్టుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలతో చెలరేగి బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. వికెట్ కీపింగ్, ఐదో స్థానంలో బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ కూడా ఇప్పటి వరకు జట్టు విజయంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టోర్నీ ఆరంభంలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నుముకలా నిలబడి విజయాన్ని అందించాడు. సూర్యకుమార్ యాదవ్, ఏడో స్థానంలోని రవీంద్ర జడేజాకు ఇప్పటివరకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పని కల్పించలేదు. వీరిద్దరూ కూడా సమయాన్ని బట్టి విజృంభించగల సత్తా ఉన్నవారే. భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా మిడిలార్డర్‌గా సరిసమానమైన బలంతోనే ఉందని చెప్పాలి. స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినప్పటికీ ఇద్దరూ కూడా స్టార్ బ్యాట్స్‌మెన్. ఒంటిచేత్తో విజయాన్ని అందించగలరు. ఆ తర్వాత వచ్చే గ్లెయిన్ మాక్స్‌వెల్ విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఈ టోర్నీలో చూశాం. త్వరగా మాక్స్‌వెల్‌ని అవుట్ చేయకపోతే.. అతడు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. అయితే అతను నిలకడగా రాణించకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
బౌలింగ్ విభాగానికి వస్తే.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.. భారత్ పేస్ దళం బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా షమీ ఈ టోర్నీలో ఆడింది ఆరు మ్యాచ్‌లే అయినప్పటికీ అత్యధిక వికెట్లు(23) తీసింది అతనే. భారత్ ఫైనల్ చేరడానికి షమీ కీలక పాత్ర పోషించాడు. ఆ ఫామ్‌ని అలాగే ప్రదర్శిస్తే మాత్రం ఆసీస్‌కు కష్టాలు తప్పవు. మరో వైపు పేస్ గన్ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. కీలక సమయాల్లో బుమ్రా అండగా ఉంటూ.. తన ప్రాముఖ్యతను చాటుతున్నాడు. సిరాజ్ కూడా కీలక సమయంలో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. సిరాజ్ నుంచి అద్భుతమైన ప్రదర్శన కోసం భారత్ ఎదురుచూస్తోంది. భారత్‌తో పోలిస్తే ఆసీస్ పేస్ దళం అంత బలంగా లేదనే చెప్పుకోవాలి. ఆ జట్టు పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ ఇప్పటి వరకు అంత గొప్పగా రాణించలేదు. హాజిల్‌వుడ్ మాత్రం తక్కువ పరుగులే ఇచ్చాడు. స్పిన్ విభాగానికి వస్తే.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా.. మరో బౌలర్ అవసరం లేకుండా ఇప్పటి వరకు లాక్కొచ్చారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి కీలక సమయంలో వికెట్లను రాబడుతున్నాడు. భాగస్వామ్యాలను విడదీయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. స్పిన్నర్ ఆడమ్ జంపా ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ 2లో ఉన్నాడు అంటే ఆ జట్టుకు అతను ఎంతో కీలకమో అర్థం చేసుకోవచ్చు. జంపాకు తోడు ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ లబుషేన్ కూడా తోడుగా నిలబడుతున్నారు. బౌలింగ్ పరంగా ఇరు జట్లు సమానమైన బలాలతో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
బ్యాటింగ్, బౌలింగ్ కాకుండా ఫీల్డిండ్ పరంగా ఇరు జట్లు సమానమైన బలంతో ఉన్నాయి. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డ్ ఉంది. కొన్ని సెంటిమెంట్స్ కూడా ఆసీస్‌కు బలంగా ఉన్నాయి. కానీ ప్రేక్షకుల మద్దతు, వెదర్ భారత్‌కు మెయిన్ బలాలు, టాస్ కూడా ఈ మ్యాచ్‌కి కీలకం కానుంది. ఇవన్నీ కాకుండా ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచ్‌లలోనూ భారత్ విజయవిహారం చేసిందంటే అది కెప్టెన్ రోహిత్ శర్మ మైండ్ గేమ్ అనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి రోహిత్ తీసుకునే నిర్ణయాలే అత్యంత కీలకం. చూద్దాం.. రోహిత్ మైండ్ గేమ్ ఎలా ఉండబోతుందో..? ఫైనల్‌గా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోన్న భారత్ టీమ్‌కు చెబుదాం.. ఆల్ ద బెస్ట్.