ఎన్నికలొచ్చేశాయ్.. మరికొద్ది రోజుల్లో మరో కొత్త పార్టీ లేదంటే ఉన్న పార్టీయే అధికారంలోకి వస్తుందా? అనేది తేలనుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కానీ అందరి మాదిరిగా ప్రచారం చేసుకుంటే కామన్ అయిపోతుంది. ప్రత్యేకత ఏముంటుంది? అనుకున్నారో ఏమో కానీ కేటీఆర్ మాత్రం వినూత్న పంథాను అవలంబించారు. చూసేందుకు ప్రచారంలా అనిపించదు కానీ ఒకరకంగా రామబాణమంత పవర్‌ఫుల్ ప్రచారాస్త్రాన్ని ప్రయోగించారు. అసలు ఇంతకీ ఆయన ఏం చేశారంటారా? బిర్యానీ తినడానికి రెస్టారెంట్‌కు వెళ్లారు. దీనిలో ప్రచారం ఏముంది? అంటారా? ఏనాడైనా కేటీఆర్ ఇలా బిర్యానీల కోసం రెస్టారెంట్‌కు వెళ్లడం చూశామా?
తమ దగ్గరకు వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేదట..
కేటీఆర్ రరాత్రి పాతబస్తీలో సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. కనీసం ప్రోటోకాల్ కూడా లేదు. సాధారణ కస్టమర్ మాదిరిగా హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా చౌరస్తా దగ్గర ఓ బిజీగా ఉండే రెస్టారెంట్‌కు వెళ్లారు. బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలు ఆర్డర్ చేసుకుని చక్కగా ఆస్వాదించారు. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో పగటి పూట కంటే రాత్రి పూట పాతబస్తీలోని రెస్టారెంట్స్ చాలా బిజీగా ఉంటాయి. ముందుగా అయితే అసలు ఆయన తమ దగ్గరకు వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేదట. ఆయన తనకు కావల్సిన ఐటెమ్స్ ఆర్డర్ ఇస్తుండటం చూసి అప్పుడు గుర్తించారట. ఆ తరువాత కేటీఆర్ అని తెలుసుకుని అంతా షాక్ అయ్యారట. ఒక సాధారణ కస్టమర్ మాదిరిగా ఎలాంటి బందోబస్తు లేకుండా రావడం చూసి అవాక్కయ్యారు.
అవాక్కైన రెస్టారెంట్ యాజమాన్యం..
కేటీఆర్ ఆ రూట్‌లో వస్తున్నారంటేనే పోలీసుల హడావుడి మామూలుగా ఉండదు. కానీ ఇలా ఒక సాధారణ పౌరుడిలా రావడం ఆసక్తికరంగా మారింది. ఇక ఆయన డిన్నర్ చేస్తూనే అక్కడున్న వారందరినీ పలకరించారు. జనం కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది కానీ.. అసలు అలాంటిదేమీ లేకుండా కేటీఆర్ వెళ్లారు. ఇక రెస్టారెంట్‌లో ఆయన బిర్యానీతోపాటు.. పలురకాల దేశవిదేశీ వంటకాలను టేస్ట్ చేశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని రెస్టారెంట్ యాజమాన్యం సైతం అవాక్కైంది. స్పెషల్ డిషెస్‌ను వడ్డించింది. ఆయన ఇటు డిన్నర్ చేస్తూనే.. అక్కడకు వచ్చిన వారిని పలకరించారు. అటు హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో సెల్ఫీలలు.. వీడియోలు తీసుకోవడంతో పాతబస్తీ అంతా సందడిగా మారిపోయింది. మొత్తానికి కేటీఆర్ మాత్రం ఈ వినూత్న ప్రచారంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.