ఎవరి గుణమైనా తెలుసుకోవాలి అంటే వారి చేతికి అధికారం ఇచ్చి చూడాలి అంటారు. ఇప్పుడు వైసీపీ నేతలకు చేతిలో అధికారం ఉంది. ముందు వెనుకా చూసుకోకుండా రెచ్చిపోయారు. బూతులతో పేట్రేగిపోయారు. ఇక ప్రతిపక్ష నేతలనైతే ఇష్టానుసారంగా మాట్లాడారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా.. సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ గెలుస్తుందన్న నమ్మకమైతే అధికార పార్టీ నేతల్లో ఇసుమంతైనా కనిపించడం లేదు. పోనీ ఏ టీడీపీలోకో లేదంటే జనసేనలోకో పోదామా? అంటే నిన్న మొన్నటి వరకూ నోటికొచ్చిన బూతులన్నీ వాడేసి ఇప్పుడు మీ పార్టీలోకి వస్తామంటే ఆ పార్టీ నేతలు ఊరుకుంటారా? ఏం చేసేది లేదు. తిరిగి జగన్‌కు డప్పు కొట్టడం తప్ప.
ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌తోనే ఉంటాం..
అసెంబ్లీలో మహిళా నేతలైతే బీభత్సంగా పొగడ్తలు. కేవలం వారి చేతిలో చిడతలు ఒక్కటే లేవు. ఉంటేనా? వాయించి వదిలిపెట్టేవారు. ఇక ఇప్పుడు ‘మా నమ్మకం నువ్వే జగన్.. మా భవిష్యత్ నువ్వే జగన్’ అంటూ భజన చేస్తు్న్నారు. తమ మనసులోని మాటలను స్టిక్కర్ల పేరిట ముంద్రించి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఇంటిటికీ తిరిగి అంటించారు. భజన బృందంలో వీరిని మించిన కళాకారులున్నారు. వారే.. మంత్రి రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్. వీరంతా మరో అడుగు ముందుకేసి ‘మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే ఉంటాం’ అంటూ చెప్పుకొస్తున్నారు. ఏం చేస్తారు. వీరినైతే ఏ పార్టీ కూడా రానివ్వదు.
వెళ్లాలన్నా ఆ పార్టీల్లోకి వెళ్లలేరు..
రాజకీయాల్లో కొనసాగాలంటే వైసీపీనే దిక్కు. నిజానికి పైన చెప్పుకున్న నేతలతో పాటు మరికొందరు నేతలు పనిగట్టుకుని మరీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. దీంతో వారందరికీ ఈ పార్టీల తలుపులు శాశ్వతంగా మూసినట్టైంది. వీళ్లు వెళ్లాలన్నా ఆయా పార్టీల్లోకి వెళ్లలేరు. వెళ్లినా వాళ్లు చేర్చుకోరు. ఇక మిగిలిన పార్టీల్లో చేరినా.. చేరకున్నా ఒకటే. ఈ క్రమంలోనే బీభత్సంగా జగన్‌ను పొగిడే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇక వైసీపీలో కొందరు నేతలైతే ఆది నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మొత్తానికి కొందరు నేతలైతే చేతిలో చిడతలు లేవు తప్ప భజన మాత్రం భయంకరంగా చేస్తున్నారు.