ఏపీ సీఎం జగన్ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఆయనే స్వయంగా ‘వై నాట్ 175’ను ఒక స్లోగన్ మాదిరిగా వైరల్ చేస్తు్న్నారు. ఇక తాజాగా టీడీపీ నేతలు.. వైసీపీకి కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సోషల్ మీడియాలో జగన్ ను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఓ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దానిని టీడీపీ కార్యకర్తలంతా తెగ వైరల్ చేస్తున్నారు. ‘ఏపీ హేట్స్ జగన్’ అంటూ చాంతాడంత లిస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి జగన్ చేసిన విధ్వంసాన్ని ఒక్క ఫొటోతోనే ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
ప్రజావేదిక మొదలు..
ఒకే ఒక్క చిత్రం ద్వారా జగన్ నాలుగున్నరేళ్ల విధ్వంసకర పాలనను వివరించే యత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన కూల్చివేతల లిస్ట్‌ను పెట్టారు. ప్రజావేదిక మొదలు.. పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల ధ్వంసం.. దేవాలయాలపై దాడులు.. పోలవరాన్ని పడుకోబెట్టడం.. రుషికొండ తవ్వకం.. ప్రత్యేక హోదా మాయం.. పరిశ్రమలను రాష్ట్రం నుంచి పారదోలడం.. దళితులపై దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు.. నిత్యావసరాల ధరల పెంపు.. కరెంటు కోతలు.. కులాల మధ్య చిచ్చు. కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియా.. అమరావతిని పునాదులతో సహా పెకలించడం వరకూ పొందుపరిచారు. వీటన్నింటినీ వివరిస్తూ ఇందుకు ఏపీ హేట్స్ జగన్ అని వివరిస్తున్నారు.
కదిలితే కేసు.. మెదిలితే కేసు..
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం.. ప్రతిపక్ష పార్టీల నేతలు కదిలితే కేసు.. మెదిలితే కేసు.. వంటివన్నీ చేసి అదేదో ఘనకార్యం చేసినట్టు ‘వై నాట్ 175’ అనడమంటే నిజంగానే చాలా గట్స్ ఉండాలి. రాష్ట్రంలో జే బ్రాండ్‌ను ప్రవేశ పెట్టి ఇబ్బడిముబ్బడిగా మద్యం అమ్మకాలు సాగించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇది చాలదన్నట్టు మైనింగ్ మాఫియా.. భూ కబ్జాలు.. ఇసుక దోపిడి చెప్పుకుంటే పోతే చాంతాడు కూడా సరిపోదేమో. పిల్లలు తాగే పాల నుంచి వాళ్లు తినే చిక్కీ వరకూ నాణ్యత అనేది ఎక్కడా చిక్కదు. ప్రజల డబ్బుతో జల్సాలు.. దేశదేశాలు తిరగడం వంటివి చేసిన జగన్ వేదాలు వల్లిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఏపీ హేట్స్ జగన్ అనడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయా? ఇంకా కావాలా? అని అడుగున్నారు.