బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్‌కు సంబంధించి రెండు రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ వీడియోలో తన దగ్గరకు వచ్చి ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటుండగా.. నానా పటేకర్ అతనిపై చేయి చేసుకుని నెట్టివేశాడు. ఈ వీడియో దాదాపు దుమారాన్నే రేపింది. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా.. నానా పటేకర్‌కు అంత గర్వం పనికిరాదని, వయసు పెరిగే కొద్ది సంస్కారం కూడా పెరిగితే బాగుంటుంది అంటూ.. నెటిజన్లు కొందరు రకరకాలుగా ఈ వీడియోని పోస్ట్ చేసి నానాని విమర్శించడం మొదలుపెట్టారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం, తనపై విమర్శలు అధికం కావడంతో నానా పటేకర్ అసలు ఏం జరిగిందో చెబుతూ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అసలు అక్కడ ఏం జరిగిందో వివరణ ఇచ్చారు. నానా పటేకర్ చెప్పేది నిజమో కాదో తెలియదు కానీ.. సన్నివేశానికి సింక్ అయ్యేలానే అయితే ఉంది. ఇది నిజమైన వీడియో కాదని, షూటింగ్‌లో పార్ట్ అని ఆయన వివరణ ఇచ్చాడు. కానీ యువకుడిని కొట్టిన విషయం మాత్రం నిజమేనని చెప్పుకొచ్చాడు. అర్థం కాలేదు కదా.. విషయంలోకి వస్తే..
అనిల్ శర్మ దర్శకత్వంలో జర్నీ అనే మూవీ షూటింగ్ వారణాశిలో జరుగుతుంది. ఈ షూటింగ్‌లో నా సన్నివేశం ఓ యువకుడిని కొట్టాలి. సన్నివేశాన్ని అప్పటికే ఒకసారి ప్రాక్టీస్ చేశాం. మళ్లీ ప్రాక్టీస్ ఏమో అనుకుని.. ఓ కుర్రాడు అటు రావడంతో కొట్టాను. నేను ప్రాక్టీస్ అనుకుని.. పొరపాటున అతడిని కొట్టేశాను. తర్వాత విషయం తెలిసి.. ఆ కుర్రాడికి సారీ చెప్పడానికి అంతా వెతికాను. కానీ అప్పటికే ఆ కుర్రాడు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జరిగింది ఇదే. సెల్ఫీ కోసం నా దగ్గరకు వచ్చే వారికి నేను ఎప్పుడూ నో అని చెప్పలేదు. అలాంటిది చేయి చేసుకుంటానా? ఆ కుర్రాడు ఇప్పుడు కనిపించినా సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.. అని నానా, వైరల్ అవుతున్న వీడియోపై క్లారిటీ ఇచ్చారు.