తెలంగాణ ఎన్నికల సిత్రాలు.. బీఆర్ఎస్‌కు పెద్ద సవాల్..
రాజకీయం అనేది ఊసరవెల్లి మాదిరి. ఎప్పుడు ఏ రంగు మార్చుకుంటుందో చెప్పలేం. పదేళ్ల పాటు తెలంగాణలో పాతుకుపోయిన బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలంటే శక్తి ఒక్కటే చాలదు. యుక్తి కూడా కావాల్సిందే. అదు పని చేస్తున్నాయి విపక్షాలు. ఎవ్వరి ఊహలకూ అందని ఎత్తుగడతో ముందుకెళుతున్నాయి. గుర్తును పోలిన గుర్తు.. పేర్లను పోలిన పేర్లు అభ్యర్థికి చిక్కులు తెచ్చి పెడుతుంటారు. 119 స్థానాలకు గానూ 20కి పైగా స్థానాల్లో అభ్యర్థుల పేర్లు పక్కాగా సూట్ అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఒకటే పేరుతో ముగ్గురు పోటీ చేస్తుండటం విశేషం. మొత్తంగా చూస్తే ఎక్కువగా టార్గెట్ మాత్రం అవుతోంది మాత్రం బీఆర్ఎస్సే అనడంలో సందేహమైతే లేదు. ఈ సవాల్‌ను బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి పోటీగా కట్టా ప్రభాకర్ రెడ్డి..
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లతోనే ఇతర పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగడం గమనార్హం. నిర్మల్‌లో అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డికి పోటీగా ఏడీఆర్ పార్టీ నుంచి మంతెన ఇంద్రకరణ్ రెడ్డి బరిలోకి దిగారు. సబితా ఇంద్రారెడ్డికి పోటీగా మద్ది సబిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి పోటీగా ఏడీఆర్ పార్టీ నుంచి కట్టా ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు పోటీగా.. ఆలిండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్ గోపాల్ బరిలో ఉన్నారు. ఇక పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్వర్‌రెడ్డికి పోటీగా ఏడీఆర్ పార్టీ నుంచి మారెడ్డి మహేశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. సనత్‌నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి పోటీగా యుగతులసి అనే పార్టీ నుంచి ఉప్పలపాటి శ్రీనివాస్ బరిలో నిలిచారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతో ఇద్దరు వ్యక్తులు..
ఇక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పోటీగా అదే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి.. అలాగే ఇండిపెండెంట్‌గా సి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆందోళ్ బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్‌కు పోటీగా ఎన్.క్రాంతి కుమార్, పి.క్రాంతికుమార్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డికి పోటీగా స్వత్రంత్ర అభ్యర్థి ఎ. వెంకటేశ్వరరెడ్డి... షాద్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యకు పోటీగా స్వత్రంత్ర అభ్యర్థిగా అంజయ్య నామినేషన్ వేశారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి పోటీగా కీసర హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక హుజూర్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి పోటీగా తిమ్మారెడ్డి సైదిరెడ్డి, గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌కి పోటీగా శుభం వ్యాస్, సందీప్ వ్యాస్ బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు సైతం కొన్ని చోట్ల సేమ్ పేర్లతో కూడిన అభ్యర్థులు పోటీకి నిలబడటం తలనొప్పిగా మారింది. ఇక వీరిలో ఎందరు గెలిచి నిలుస్తారో చూడాలి.