క్రికెట్ ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను అదృష్టం వరించింది. సౌతాఫ్రికాను బ్యాడ్‌లక్ వెంటాడింది. ఫలితంగా సఫారీలపై కంగారు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా అజేయ భారత్‌ను ఢీ కొట్టబోతోంది. ఇక గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాను స్టార్క్, హేజిల్‌వుడ్ ఆరంభంలోనే 2 వికెట్లు పడగొట్టి కష్టాల్లోకి నెట్టారు. 24 పరుగులకే కీలకమైన 4 వికెట్లను పోగొట్టుకున్న సౌతాఫ్రికాను క్లాసేస్, మిల్లర్ ఆదుకున్నారు. మధ్యలో వర్షం కారణంగా కాసేపు మ్యాచ్ ఆగినప్పటికీ వీరిద్దరూ నిలకడగా ఆడుతూ.. స్కోర్ బోర్డును కదిలించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో క్లాసేన్(47)ను బౌల్డ్ చేసి ఆసీస్‌కు బ్రేకిచ్చాడు హెడ్. ఆ వెంటనే జాన్‌సేన్ (0)ను ఎల్‌బీడబ్ల్యూ చేసి మరోసారి ఆసీస్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఒక వైపు వరుసగా వికెట్లు టపాటపా రాలుతున్నా.. డేవిడ్ మిల్లర్ మాత్రం సహనాన్ని ప్రదర్శిస్తూ.. మధ్య మధ్యలో షాట్స్ ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 116 బంతులు ఆడిన మిల్లర్ 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ అంతగా రాణించలేదు. ఫలితంగా సౌతాఫ్రికా జట్లు 49.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్ తలో 3 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్, హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టుకు లక్ష్యాన్ని చేధించడం అంత ఈజీ కాలేదు. ఆరంభంలో ఓపెనర్లు హెడ్, వార్నర్ ధాటిగా ఆడుతూ మొదటి వికెట్ 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డేవిడ్ వార్నర్ (29) మార్కరమ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆరంభంలోనే రెండు వికెట్లను తీసి ఉంటే మాత్రం ఖచ్చితంగా సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరేది. కానీ బ్యాడ్‌లక్.. కంగారులలో కంగారు పుట్టించినా.. చివరికి విజయం వారినే వరించింది. మధ్యలో కాసేపు సౌతిఫ్రికా వైపు మ్యాచ్ టర్న్ అయినట్లుగా అనిపించినా.. సౌతిఫ్రికా ఫీల్డింగ్ తప్పిదం వల్ల మ్యాచ్‌ని చేజార్చుకోవాల్సి వచ్చింది. మరో 20 పరుగులు చేసి ఉంటే ఖచ్చితంగా సఫారీలు ఫైనల్‌కు చేరేవారు. ఆటగా ఎలా ఉన్నా.. అదృష్టం మాత్రం సపారీ జట్టుకు అస్సలు యాడ్ కాలేదు. ఆసీస్ జట్టులో హెడ్ (62), మార్ష్ (0), స్మిత్ (30), మార్నస్ (18), మ్యాక్స్‌వెల్ (1) వంటి వారంతా అవుటైనా.. చివరిలో ఇంగ్లిస్ (28), స్టార్క్ (16), కమిన్స్ (14) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెడ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.