నువ్వు దేవుడి బిడ్డవు.. నిన్ను నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటానని.. రన్ మెషీన్ కింగ్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తన ఇన్‌స్టా పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. బుధవారం ముంబై వేదికగా జరిగిన క్రికెట్ ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసి.. చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు సచిన్ 49 సెంచరీలతో టాప్ స్థానంలో ఉండగా.. కోహ్లీ ఈ సెంచరీతో హాఫ్ సెంచరీల సెంచరీలను పూర్తి చేసి ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
అయితే కోహ్లీ 50 సెంచరీల రికార్డ్ కంటే కూడా.. జట్టు గెలవడం ముఖ్యం. ఆ గెలుపు కూడా దక్కడం, ఫైనల్‌కు చేరుకోవడంతో.. సెమీ ఫైనల్‌లో ఆడిన భారత్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన భర్త సాధించిన రికార్డ్‌తో పాటు.. జట్టుగా భారత్ ఫైనల్‌కు చేరుకోవడం పట్ల అనుష్క శర్మ సంతోషం వ్యక్తి చేసింది. ఇన్‌స్టా వేదికగా కోహ్లీపై తన మనసులోని మాటను చెప్పిన అనుష్క.. టీమ్, షమీపై ప్రశంసలు కురిపించి.. చరిత్రకు ఇంకో అడుగు దూరమే ఉందనేలా కొన్ని పిక్‌లను షేర్ చేసింది.
దేవుడు గొప్ప స్క్రిప్ట్ రైటర్. నీ ప్రేమ నాకు దక్కినందుకు, నీ ఎదుగులను చూసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మనసులోనూ, ఆటపై నిజాయితీగా ఉండే నువ్వు.. భవిష్యత్తులో ఇంకెన్నో, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు. నిజంగా నువ్వు దేవుడి బిడ్డవు.. అంటూ కోహ్లీపై తన ప్రేమను కనబరిచింది. సెమి ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన మహమ్మద్ షమీ పిక్‌కు, ప్రపంచకప్‌కు అడుగు దూరంలో ఉన్నట్లుగా వైరల్ అవుతోన్న టీమిండియా సభ్యుల ఫొటోను కూడా అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేసింది.