ఏపీ సీఎం జగన్ ఎప్పుడూ ‘వై నాట్ 175’ అంటూ ఉంటారు. అసలు అదెలా సాధ్యం 2018లో వైసీపీ మాంచి ఊపు మీదున్నప్పుడే సాధ్యం కాలేదు. ఇప్పుడు వారి ప్రతాపమేంటో ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ తరుణంలో ఏ ధైర్యంతో ‘వై నాట్ 175’ అంటున్నారని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అరే తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆరే వై నాట్ 119 అనడం లేదు. జగన్ ఏపీని నాశనం చేయడం తప్ప అభివృద్ధి అనేదే లేదు. అయినా సరే.. తారకమంత్రంలా ‘వై నాట్ 175’ను జపిస్తున్నారు. అంత ధైర్యమేంటి? అని అంతా అవాక్కవుతున్నారు. అయితే తాజా పరిణామాలతో అంతో ఇంతో జగన్ వ్యూహం ఏంటనేది తెలియవచ్చింది. ఏ ధైర్యంతో పదే పదే జగన్ ఆ మాట అంటున్నారో జనాలకు అర్థమవుతోంది.
వేరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు
సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేశామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించాలంటే సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వం అదే చేసింది. కేసీఆర్ ప్రభుత్వం అదే చేస్తోంది. దానికే ఓట్లు రాలుతాయంటే చంద్రబాబు అసలు ఓడిపోయి ఉండేవారు కాదు. అలాగే సంక్షేమమే గెలిపిస్తుందంటే.. అన్ని ప్రభుత్వాలూ అదే పని చేస్తాయి. వేరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు. కానీ వైసీపీ ప్రభుత్వం ధీమా వెనుక సంక్షేమం కాదు.. పెద్ద కుట్రే దాగి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు ఎన్నికల సమయానికి ఆ పార్టీ నేతలందరిపై కేసులు వేసి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇలాంటి అరెస్ట్‌లు చాలా జరుగుతాయట..
ఎన్నికల నాటికి టిడిపి నేతలందరిపై కేసులు వేసి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ వీలైతే చంద్రబాబు నాయుడులా జైలుకి పంపించో ఎవరూ ప్రజల మద్య తిరగనీయకుండా చేసి వారి నుంచి పోటీ లేకుండా చేసుకోవడమే అని అర్దమవుతోంది. దీనికి నిదర్శనమే పులివెందుల టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి బీటెక్ రవి అరెస్ట్. దాదాపు ఏడాది క్రితం జరిగిన దానికి నిన్న అరెస్ట్ చేశారు. ఆయనేమైనా పారిపోయారా? అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? అప్పుడు పెట్టిన సాధారణ కేసుని చిలవలు పలవలు చేసి నాన్ బెయిలబుల్ కేసు కింద మార్చేశారు. బీటెక్ రవి కడప నుంచి పులివెందుల వెళుతుంటే దారి మధ్యలో కాపు కాసి మఫ్టీలో ఉన్న పోలీసులు కిడ్నాప్‌ను తలపించేలా అరెస్ట్ చేశారు. ఆయనొక్కడే కాదు.. ఇకపై ఇలాంటి అరెస్ట్‌లు చాలా జరుగుతాయని టాక్. టీడీపీ నుంచి పోటీ చేస్తారని భావించే నేతలందరినీ అరెస్ట్ చేసి జైలు చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరిగేలా చేయడమే లక్ష్యమట. తద్వారా జనాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా చేసి ఓట్లు దండుకోవాలని వైసీపీ యోచిస్తోందట. ‘వై నాట్ 175’ వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.