తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నామస్మరణను అన్ని పార్టీల నేతలూ ముక్తకంఠంతో చేస్తున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకూ చంద్రబాబును ఆడిపోసుకున్న బీఆర్ఎస్ నేతలు సైతం ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తున్నారు. నిజానికి ఇదంతా జగన్ పుణ్యమేనని చెప్పాలి. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అనేది ఆయనకు మాయని మచ్చే అనడంలో సందేహం లేదు కానీ ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రపంచంలోని పలు దేశాల్లో సైతం దీనిని నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. మొత్తానికిక జగన్ ఏమనుకుని చంద్రబాబును అరెస్ట్ చేయించారో.. ఆయన సంకల్పం నెరవేరిందో లేదో కానీ.. చంద్రబాబుకు అయితే విపరీతమైన మైలేజ్ వచ్చింది.
అడ్డంగా బుక్కైన కేటీఆర్..
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. బీఆర్ఎస్ మొదలు.. కాంగ్రెస్, బీజేపీ, చివరకు అతికొద్ది స్థానాల్లో పోటీ చేసిన జనసేన సైతం చంద్రబాబు నామాన్ని జపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో వెల్లువెత్తిన నిరసనలకు అడ్డుకట్ట వేయబోయి మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు. తప్పు దిద్దుకునే యత్నం ఆ వెంటనే చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం తనను ఎంతగానో బాధించిందని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నారు. ఆయనే కాదు.. పార్టీ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చారు. టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకే ఇదంతా చేశారనడంలో సందేహం లేదు.
బీఆర్ఎస్ బాటలోనే బీజేపీ..
మొత్తానికి ప్రజల్లో చంద్రబాబుపై వచ్చిన సానుభూతిని క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు నానా తంటాలు పడ్డారు. వారి బాటలోనే బీజేపీ. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ను కిషన్ రెడ్డి సహా, ఈటల రాజేందర్, బండి సంజయ్ తదితరులు ఖండించారు. జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం చంద్రబాబు జపమే చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా చంద్రబాబు తన గురువని.. టీడీపీ తన పుట్టిల్లని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక జనసేన పార్టీ సైతం తాను పోటీ చేసిన స్థానాల్లో ఏపీలో తాము టీడీపీతో పొత్తులో ఉన్నామని కాబట్టి టీడీపీ కేడర్ అంతా తమకు ఓటేయాలని అర్థిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో టీడీపీ కీలకంగా మారింది.