క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా నేడు (బుధవారం) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీస్ సమరానికి అంతా సిద్ధమైంది. ఇంకాసేపట్లో రెండు జట్ల మధ్య భీకరపోరు జరగబోతోంది. లీగ్‌లో వరుస విజయాలతో టీమిండియా ధీమాగా ఉన్నప్పటికీ.. గతంలో నాకౌట్ దశలో కివీస్‌పై ఉన్న రికార్డ్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే.. గత 20 ఏళ్లలో ఐసీసీ టోర్నీల్లో మన జట్టు కివీస్‌పై ఒకే ఒక్కసారి గెలిచింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌ను కివీస్ చావు దెబ్బ తీసింది. అయితే మళ్లీ అదే రిపీట్ అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింట్లోనూ బలంగా ఉంది. అలా అని.. కివీస్‌ని తక్కువ అంచనా వేయడానికి కూడా వీలు లేదు. ఒక్కసారి ఇరు జట్ల బలాలు, బలహీనతలను గమినస్తే..
ముందుగా బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఇరు జట్లలోనూ స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. టీమిండియాలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీ బాగుంది. ఫస్ట్ బ్యాటింగ్ అయినా, సెకండ్ బ్యాటింగ్ అయినా.. వీరిద్దరూ గట్టిగా 10 ఓవర్లు నిలబడితే చాలు. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండటమే కాకుండా పవర్‌ప్లేలో చిచ్చరపిడుగులా చెలరేగుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ హిట్‌మ్యాన్ పవర్ ప్లే అంతా ఆడి మంచి ఆరంభం ఇస్తే బ్యాటింగ్‌లో టీమిండియాకు తిరుగుండదు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్‌లో ఉన్న కోహ్లీ టాప్‌లో ఉండగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాతో మన మిడిలార్డర్ బలంగా ఉంది. బ్యాటింగ్ వీరి వరకు ఉంటే భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం. బౌలర్లు బ్యాటింగ్ చేసే పరిస్థితి రాకూడదనే కోరుకోవాలి. కివీస్ విషయానికి వస్తే డేవాన్ కాన్వే అంతగా ఫామ్‌లో లేదు. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర మాత్రం మంచి ఫామ్‌లో ఉండటమే కాకుండా భారీ స్కోర్లు చేస్తున్నాను. రచిన్‌ను త్వరగా ఔట్ చేయాలి. లేదంటే భారత్‌కు కష్టాలు తప్పవు. భారత్‌కు కోహ్లీ, అతని స్థానం ఎంత కీలకమో.. కివీస్‌కు కూడా అదే కీలకం. మూడో స్థానంలో కేన్ విలియమ్సన్ ఆడనున్నాడు. వీరిద్దనై ఒంటి చేతితో మ్యాచ్‌ను గెలిపించగలరు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో కూడా ఉన్నారు. మిడిలార్డర్ విషయానికొస్తే.. కివీస్ మిడిలార్డర్ అంత బలంగా లేదు. ఆ జట్టు మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ మినహా మిగతా వారెవరూ ఇప్పటి వరకు సరైన ప్రదర్శన ఇవ్వలేదు. గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మార్క్ చాప్‌మన్ మంచి ఆటగాళ్లే అయినా ఫామ్ సమస్య వారిని వెంటాడుతోంది.
బౌలింగ్ విషయానికొస్తే టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. పేస్ బౌలింగ్‌ను చాలా బాధ్యతతో నిర్వర్తిస్తున్నారు. బుమ్రా ఇప్పటికే 17 వికెట్లు తీశాడు. పవర్‌ప్లేలో బుమ్రా తన ప్రతిభను కనబరుస్తున్నాడు. షమీ ఆడిన 4 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ పరుగులు ఎక్కువ ఇచ్చినా త్వరగా బ్రేక్ ఇస్తున్నాడు. కివీస్ పేస్ బౌలింగ్ యూనిట్‌లో ఆ జట్టు సీనియర్ పేసర్లు టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ రాణించలేకపోతున్నారు. ఫెర్గ్యూసన్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్ పరంగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో భారత్ బౌలింగ్ బలంగా ఉంది. 6వ బౌలర్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా దూరమైనా.. అతని అవసరం అంతగా ఇప్పటి వరకు కనిపించలేదు. గత మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీశారు కాబట్టి.. పరిస్థితులను బట్టి వారు కూడా ఒకటి రెండు ఓవర్లు పంచుకునే అవకాశం ఉంది. ఇక భారత్‌లో పోలిస్తే కివీస్ స్పిన్ యూనిట్ అంత బలంగా లేదనే చెప్పుకోవాలి. మిచెట్ శాంట్నర్, అతనికి తోడుగా ఉన్న పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఫిలిప్స్, రచీన్ రవీంద్ర కూడా ఇప్పటి వరకు అంతగా ప్రభావం చూపించలేదు. ఫీల్డింగ్‌లో విషయంలో మాత్రం ఏ జట్టుని తీసేయడానికి లేదు. రెండు కూడా చాలా బలంగా ఉన్నాయి. పిచ్, వెదర్ భారత్‌కు మరింత బలం కానున్నాయి. చూద్దాం మరి నాకౌట్‌లో న్యూజిలాండ్‌పై ఉన్న చెత్త రికార్డ్‌ను బద్దలు కొట్టి.. చరిత్ర సృష్టించడానికి అడుగు దూరానికి భారత్ చేరుకుంటుందో లేదో..