కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కిడ్నాప్‌నకు గురయ్యారు. అంతా ఒక్కసారిగా షాక్. ఆయన సతీమణి హడావుడిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఆయనను కిడ్నాప్ చేసిందెవరు? అర్ధాంతరంగా ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అన్న విషయాలకు సమాధానం తెలిసి అంతా అవాక్కయ్యారు. అసలు బీటెక్ రవిని ఎత్తుకెళ్లిందే పోలీసులు. మఫ్టీలో ఉండటంతో ఎవరూ పోలీసులని భావించలేదు. కడప జిల్లాలోని పెండ్లిమర్రి పోలీసు స్టేషన్ పరిధిలో ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. ఎప్పటిదో పాత కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.
అందుకే కక్ష పెంచుకున్నారట..
మరో విషయం ఏంటంటే.. ఇప్పుడు ఏపీలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ అభివృద్ధికి తిలోదకాలిచ్చి కక్షపూరిత రాజకీయాల వెంట పడ్డారు. ఇప్పుడు పాలకులను పోలీసులు కూడా అనుసరిస్తున్నారని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించిన సమయంలో బీటెక్ రవి పోలీసులతో కాస్త దురుసుగా ప్రవర్తించారట. అసలు అప్పుడు పోలీసులు ఏం చేశారో.. ఆయనెందుకు అలా ప్రవర్తించారో కానీ దాంతో కక్ష పెంచుకున్నారట పోలీసులు. ఇప్పుడు తీరిగ్గా బీటెక్ రవిపై ఉన్న కేసులన్నింటినీ తిరగదోడి అరెస్ట్ చేశారని సమాచారం. అయితే అసలు రవి అరెస్ట్‌కు మెయిన్ కారణం అయితే తెలియరాలేదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రవిని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసుల ఫోన్లు ఒక్కటి కూడా పని చేయలేదని తెలుస్తోంది.
ప్రభుత్వం ఆడిస్తున్న ఆటలో కీలుబొమ్మలుగా పోలీసులు..
ఇక రవి అరెస్ట్ తర్వాత చాలా సేపటికి గానీ అసలు అరెస్ట్ వెనుక కారణమేంటో తెలియరాలేదు. 10 నెలల క్రితం నారా లోకేష్ కడప జిల్లాకు పర్యటనలో బీటెక్ రవిని పోలీసులు ఎయిర్‌పోర్టులోకి అనుమతించలేదట. ఈ నేసథ్యంలో పోలీసులకి, బీటెక్ రవికి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అయితే అప్పట్లో బీటెక్ రవిపై 324 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు దానిని నాన్ బెయిలబుల్‌గా మార్చారు. అప్పటికప్పుడు జడ్జి నివాసం వద్ద 41 ఏ నోటీసు ఇచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీనిపై జడ్జి సైతం అభ్యంతరం తెలిపారు. మొత్తానికి బీటెక్ రవికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇక ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? వైసీపీ ప్రభుత్వం ఎంతకాలం ప్రతిపక్ష నేతలను కేసుల పేరిట వేధిస్తుందని సామాన్య ప్రజానీకం సైతం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఆడిస్తున్న ఆటలో కీలుబొమ్మలుగా పోలీసులు మారితే వారికే నష్టమని హెచ్చరిస్తున్నారు. పదవులనేవి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివి. అలాంటి పదవులను అడ్డుపెట్టుకుని వైసీపీ గేమ్ ఆడుతుంటే.. దానికి పోలీసులు తానా అంటే తందానా? అనడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి.