ఆది నుంచి గులాబీ బాస్‌తో కొనసాగిన ఈటల రాజేందర్.. మంత్రిగా పార్టీకి ఎన్నో సేవలందించిన అనంతరం.. ఎన్నో అవమానాలకు గురై చివరకు బీఆర్ఎస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన తన కేడర్‌తో చర్చించి ఆ సమయంలో కాస్త బీజేపీ హవా నడుస్తోందని ఆ పార్టీ జెండా పట్టుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఆ పార్టీ డౌన్ అయిపోయింది.. ఆ ప్లేస్‌లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చొంది. అయినా సరే.. కాంగ్రెస్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా ఈటల అయితే బీజేపీని వీడాలని అనుకోలేదు. ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీనికి ఆ పార్టీ అధిష్టానం కూడా ఒక కారణమే అనడంలో సందేహం లేదు.
బండి సంజయ్‌కు ఈటలకు పడటం లేదా?
ఢిల్లీ పెద్దలు ఈటలకు ఏవో హామీలైతే ఇచ్చారు. దీంతో కమలం పార్టీలోనే ఉండిపోయారు. అంతేకాకుండా ప్రస్తుత ఎన్నికల తరుణంలో బీజేపీ ప్రచార బాధ్యతలన్నీ ఆయనే స్వయంగా చూస్తున్నారు. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలను చూసుకుంటూ.. కమలం పార్టీ అభ్యర్థుల తరఫున మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే పార్టీలో బండి సంజయ్‌కు ఈటలకు పడటం లేదన్న టాక్ అయితే ఉంది. అయినా సరే తనను నమ్ముకున్న నేతలను కాపాడుకుంటే చాలని ఆయన భావించారు. కానీ అది కూడా ఇప్పుడు లేదు. తనను నమ్ముకున్న నేతలు ఇద్దరూ.. ఆయనకు దూరం అయిపోయారు. దీనికి బీజేపీ అధిష్టానం కూడా ఒక కారణమే.
ఈటల షాక్..
ఈటల రాజేందర్‌కు అత్యంత ఆప్తురాలైన బీసీ నేత తుల ఉమ బీజేపీకి రాజీనామా చేశారు. ఆమెకు బీజేపీ అధిష్టానం వేములవాడ టికెట్ కేటాయించి ఆ తరువాత హ్యాండ్ ఇచ్చింది. చివరి నిమిషంలో ఆమెకు కాకుండా బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తనయుడు వికాస్‌కు టికెట్‌తో పాటు బీఫామ్ ఇచ్చింది. దీని వెనుక బండి సంజయ్ ఉన్నారని టాక్ నడిచింది. అధిష్టానం ఈ నిర్ణయంతో ఈటలతో పాటు తుల ఉమా షాక్ అయ్యారు. ఆమె పార్టీని వీడారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి.. ఈయన గతంలో ఈటల ఎక్కడుంటే అక్కడుండే వారు. ఆయన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండేవారు. కానీ తాజాగా ఏనుగు రవీందర్ రెడ్డి సైతం ఈటలను కాదని బీజేపీకి గుడ్ బై చెప్పారు. వరుసగా ఇద్దరు తన ముఖ్య అనుచరులు పార్టీని వీడటంతో బీజేపీలో ఈటల ఒంటరయ్యారని టాక్ నడుస్తోంది.