అన్నీ ఉన్న అమ్మ అణిగిమణిగి ఉంటుంది.. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది అంటారు. ఇప్పుడు వైసీపీ కూడా ఏపీలో ఇదే పని చేస్తోంది. ఏమీ లేకున్నా ఎగిరెగిరి పడుతోంది. ఏదో జనాల్లోకి తీసుకెళ్లాలని నానా తంటాలు పడుతోంది. ప్రజలకు చాలా చేశాం తమకు తిరుగులేదంటూ మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తోంది. కానీ వాస్తవాలు తెలుసుకుని లోలోపల మాత్రం బాగా మథనపడుతోందని టాక్. చేపట్టిన ఏ కార్యక్రమం కూడా సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు. ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపడితే.. అవును జగన్ మాత్రమే ఎందుకు కావాలి? ఏం చేశారని కావాలంటూ జనం ఎద్దేవా చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై రివర్స్ కౌంటర్స్ అన్నీ ఇన్నీ కావు.
సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్న వైసీపీ..
ఇక సామాజిక సాధికార బస్సు యాత్ర అంటూ ఇంత బారు పేరు పెట్టి కార్యక్రమం చేపడితే అటు దిక్కు చూసే నాథుడే లేక అట్టర్ ఫ్లాప్ అవుతోంది. కీలక నియోజకవర్గాల్లో సైతం జనం ముఖం చాటేస్తున్నారట. పోనీలే సర్వేలు అనుకూలంగా వస్తున్నాయని సంబర పడటానికి కూడా లేదు. అంతర్గత సర్వేలన్నీ అధిష్టానానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయట. అసలే మూలిగే నక్క మాదిరిగా వైసీపీ పరిస్థితి ఉందంటే.. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ వంటి పనికిమాలిన పనులతో సెల్ఫ్ గోల్స్ వేసుకుంది. అది చాలదన్నట్టు ఆయన బెయిల్‌పై బయటకు వచ్చాక కూడా ఏదో ఒక కేసులో ఇరికించాలని నానా తంటాలు పడుతోంది. మొత్తంగా చూస్తే రాజకీయ కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి లేదని జనం భావిస్తున్నారు.
కక్ష సాధింపునకే ప్రాధాన్యం..
రాష్ట్రంలో అభివృద్ధి అనేది అధ: పాతాళానికి తొక్కేసింది. పోనీలే.. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఏమైనా ఉందా? అంటే నోటిఫికేషన్లు విడుదల చేసేది లేదు.. వచ్చిన పరిశ్రమలకు మోకాలు అడ్డుతోంది. మొత్తానికి పాలనను గాలికి వదిలేసి కక్ష సాధింపు అంశాలకే ఏపీ సీఎం జగన్ ప్రాధాన్యమిచ్చారన్న టాక్ ఉంది. గతంలో మంచి సక్సెస్‌ను ఒకరకంగా వైసీపీ ఊహించని సక్సెస్‌ను ప్రజలు కట్టబెట్టారు. కానీ దానిని నిలబెట్టుకోవడంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. క్షేత్ర స్థాయిలో వైసీపీపై వ్యతిరేకత బీభత్సంగా వచ్చేసింది. సర్వేలు సైతం ప్రమాద ఘంటికలను మోగిస్తుండటంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇదే విషయంలో మంత్రుల మధ్య కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. తాను బయటకు రాకుండా ఎంతసేపూ ఆ యాత్రలు.. ఈ యాత్రల పేరుతో తామే జనాల్లోకి వెళుతుంటే ఎలా అనే చర్చ జరుగుతోందట. మొత్తానికి వైసీపీ గ్రాఫ్ అయితే ఢమాల్. దీనిని నిలబెట్టుకునేందుకు అధిష్టానం యత్నిస్తుందా? లేదంటే అదే కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళుతుందా? అనేది చూడాలి.