తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ఓడించడమంటే సాధారణ విషయమేమీ కాదు. ఇప్పటి వరకైతే అది అసాధ్యమనే చెప్పాలి. కానీ కొందరు నేతలు మాత్రం దానిని సుసాధ్యం చేస్తామంటున్నారు. చివరకు ఆయన తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే ఓడిస్తామని శపథం చేశారు. ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించి తీరుతామంటున్నారు. కామారెడ్డి నుంచి రేవంత్.. గజ్వేల్ నుంచి ఈటల బరిలోకి దిగారు. ఈ రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం గమనార్హం. ఇక వీరిద్దరేనా? అంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. కేసీఆర్‌ను ఓడించాలన్న సంకల్పంతో వందల సంఖ్యలో నామినేషన్లు పడటం గమనార్హం.
ప్రజాబలం ఏమైనా తక్కువా?
పొరపాటున ఒక్కచోట ఓడినా కూడా కేసీఆర్‌కు అది మాయని మచ్చలా మిగిలిపోతుంది. రేవంత్, ఈటల ఇద్దరూ కేసీఆర్ బాధితులే. ఆయన కారణంగా తీవ్ర అవమానాలకు గురైన వారే. పోనీ వీరిద్దరికీ ప్రజాబలం ఏమైనా తక్కువా? అంటే అదీ లేదు. ఇక గజ్వేల్‌లో ఈటల మాత్రమే కాకుండా మరో 145 మంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా నామినేషన్స్ వేశారు. అలాగే కామారెడ్డిలో కూడా 92 మంది నామినేషన్స్ వేశారు. ఇంతమంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎందుకు నామినేషన్స్ వేశారంటారా? గజ్వేల్‌లో నామినేషన్స్ వేసిన వారిలో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి నిర్వాసితులు 100 మంది ఉండగా.. అమరవీరుల కుటుంబాలకు చెందినవారు మరో 30మంది..ఇక మిగిలిన వారిలో నిరుద్యోగులు, రైతులు ఉన్నారు.
15 వరకూ నామినేషన్స్ ఉపసంహరణకు గడువు..
గత ఎన్నికలలో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయనందుకు నిరసనగా వందల మంది రైతులు కవితకు వ్యతిరేకంగా నామినేషన్స్ వేశారు. మొత్తానికి కవిత ఓడిపోయారు. నిజానికి ఇది ఎవరూ ఊహించని పరిణామం. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ విషయంలోనూ అదే సమస్య ఎదురు కావడంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఈ నెల 15 వరకూ నామినేషన్స్ ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా వీలైనంత మందితో నామినేషన్స్ ఉపసంహరింపజేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది. 15 తర్వాత ఎంతమంది బరిలో నిలుస్తారో తెలుస్తుంది. ఎక్కువ మంది బరిలో ఉంటే మాత్రం కేసీఆర్‌కు కష్టమే. ఓట్లు చీలి అది ప్రతిపక్షాలకు లాభం చేకూరుస్తుంది. చూస్తుంటే కేసీఆర్ సారు కారుకు పంక్చర్ తప్పదేమో అనిపిస్తోంది.