ఏపీలో జనసేన, టీడీపీలను ఎలా ఇరికించాలా? అని వైసీపీ చూస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేతపై కేసుల మీద కేసులు పెట్టి వేధిస్తోంది. అది చాలదన్నట్టుగా ఆయనకు బెయిల్ పొడిగింపు లేకుండా చూడాలని.. ఎలాగైనా మరికొన్ని కేసులు ఆయనపై మోపాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ఇటు జనసేనను కూడా ప్రశాంతంగా వదిలేయడం లేదు. లేనిపోని అభాండాలన్నీ మోపి ఆ పార్టీని కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు బదనాం చేస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే మన బలం సరిపోదని భావించినప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ఏదో ఒకరకంగా అభాండాలు మోపి.. జనంలో వాటి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసి తొక్కేసి తద్వారా లబ్ది పొందండం ఒక లెక్క. ప్రస్తుతం వైసీపీ చేస్తున్నది ఇదే.
ఏపీ డీజీపీగా పని చేశారట..
ప్రస్తుతం జనసేనను ఓ అదృశ్య శక్తి నడిపిస్తోందంటూ సరికొత్త ప్రచారానికి వైసీపీ సహా.. ఆ పార్టీ సొంత మీడియా తెరదీసింది. ఆ శక్తి ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన ఏపీ డీజీపీగా కూడా పని చేశారట. ఆయన సేవలను జనసేన వాడుకుంటోందట. అయితే జనసేన పార్టీ తరుఫున ఆయన ఎన్నడూ ముందుకు రాలేదు కానీ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరదీసింది. టీడీపీతో పొత్తు విషయంలో కూడా సదరు పోలీస్ మాజీ బాస్ జనసేనకు సలహాలిస్తున్నారట. ఇక సదరు బాస్‌కు సంబంధించి చాలా డీటైల్స్ ఇచ్చారు. ఆయన మాజీ అల్లుడు టీడీపీ మహిళా నేతో ప్రేమలో పడి ఆమెను వివాహమాడారని చెబుతున్నారు.
ప్రతిపక్ష పార్టీ నియమించుకోకూడదంటే ఎలా?
అసలు అవన్నీ వాళ్ల పర్సనల్ విషయాలు. ఎవరు.. ఎవరిని పెళ్లాడితే ఏంటి? ఎప్పుడు ఎదుటి వ్యక్తి పెళ్లిళ్ల గురించి తప్ప రాజకీయంగా విమర్శించడానికేం లేదా? పవన్ తన సలహాదారుడిగా ఒక మాజీ పోలీస్ బాస్‌ను నిజంగానే పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ ఒకవేళ పెట్టుకుంటే తప్పేంటి? వైసీపీ ఐ ప్యాక్‌ను నియమించుకోలేదా? ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు చేయడం లేదా? ఏ పార్టీ అయినా సలహాదారుడిని నియమించుకోవడం అనేది వాళ్లిష్టం. వాళ్ల సలహాల మేరకు నడుచుకుంటూనే ఉంటాయి. వైసీపీ నియమించుకుంటే తప్పు లేదు కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం నియమించుకోకూడదంటే ఎలా? పొలిటికల్‌గా వ్యూహానికి ప్రతివ్యూహంతో ముందుకెళ్లడంలో తప్పు లేదు. పైగా మంచి స్ట్రాటజీతో వెళితే ప్రశంసలు దక్కుతాయి కానీ ఇలా చిల్లర కామెంట్లతో సాధించేదేం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.