కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శించాల్సి వస్తే ముందుగా విమర్శించేదేంటి? టీడీపీ ప్రో అని విమర్శిస్తూ ఉంటారు. కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఆయనపై వస్తున్న విమర్శలివే.. ఇక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మొదలు విమర్శలు మరింత వెల్లువెత్తుతున్నాయి. సరే ఈ విమర్శలన్నింటినీ పక్కనబెడితే తాజాగా రేవంత్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. టీడీపీ గురించి స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరేమో.. టీడీపీ ఓట్ల కోసమే రేవంత్ అలా మాట్లాడారంటున్నారు. మరికొందరేమో టీడీపీతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకున్నారని అంటున్నారు.
అసలు రేవంత్ ఏమన్నారంటే..
‘‘నేను చంద్రబాబు నాయుడు గారి సహచరుణ్ణి. సహచరుడిగా నిబద్దతతో పని చేసినా.. చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించారు. అవకాశం ఇచ్చారు. ఇదంతా ఒక ఎపిసోడ్. నేను అక్కడి నుంచి బయటకు వచ్చి తర్వాత ఇంకొక దగ్గర ఉన్నా. కూతురు తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత కాలం.. వారి పక్షానే ఉంటుంది. కూతురు ఒకింటికి కోడలిగా వెల్లిన తర్వాత అత్తింటి గౌరవాన్ని కాపాడటమే కోడలిగా ఆమె బాధ్యత. నేను నా పాత్రను కోడలిగా పోషించాల్సిందే. అంతే తప్ప పుట్టింటి గొప్పలన్నీ ఊరు మీద ఉన్నోళ్లందరికీ చెప్పుకోం కదా. అమ్మానాన్నల మీద ప్రేమ వేరు. గొప్పలు వేరు. చంద్రబాబునాయుడు గారంటే నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడైనా చెప్పానా? ఎవరికైనా చెప్పానా? పోనీ అలా చెబితే ఎవరైనా నమ్ముతారా?’’ అని రేవంత్ ప్రశ్నించారు.
ప్రసన్నం చేసుకోవడానికేనా?
ఆయన చెప్పింది అక్షరాలా నిజమే. రేవంత్ ఎప్పుడూ కూడా చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదని ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. అయితే ఇప్పుడు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం కేవలం టీడీపీ నేతలు, కేడర్ ఓట్ల కోసమేనని టాక్ నడుస్తోంది. టీడీపీ కేడర్‌ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. లేదంటే చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నా కూడా లేనిది.. ఇప్పుడే ఎందుకు రేవంత్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా సరే.. రేవంత్ మాత్రం అదంతా అయిపోయిన ముచ్చట. ఇప్పుడు టీడీపీతో తనకు సంబంధం లేదనో మరొకటో చెప్పకుండా చంద్రబాబును తానేనాడూ విమర్శించింది లేదని ఒప్పేసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.