క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ అణుబాంబ్‌లా పేలి నెదర్లాండ్స్‌పై విధ్వంసం సృష్టించింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్ స్థానంలో ఉన్న భారత్, లాస్ట్ స్థానంలో ఉన్న నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్.. నామమాత్రానిదే అయినా.. భారత్ బ్యాట్స్‌మెన్ అస్సలు ఎక్కడా తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఊచకోత కోశారు. పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు యాడ్స్‌లో 1, 2, 3 అని ఎలా అయితే వినిపిస్తుందో.. అలానే.. ఇక్కడ కూడా వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. చివరిలో శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 410 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. మొదటి నుంచి దూకుడుగానే ఆటను ప్రారంభించింది. ఓపెనర్లు శుభమన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ నెదర్లాండ్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించి శుభమన్ గిల్ (51)కి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ కూడా స్టార్టింగ్ నుంచే వేగం పెంచాడు. రోహిత్ 61 పరుగుల వద్ద బాస్ డే లీడే బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ నెమ్మదిగా తన ఆటను ప్రారంభించాడు.
ఇక కాస్త నిలదొక్కుకోగానే శ్రేయస్ ఫోర్లు, సిక్సర్లతో నెదర్లాండ్స్‌పై శివతాండవం ఆడేశాడు. మధ్యలో కింగ్ కోహ్లీ (51) బౌల్డ్ అయినప్పటికీ శ్రేయస్ తన వేగం తగ్గించలేదు. కోహ్లీ అవుటయిన తర్వాత వచ్చిన కె.ఎల్. రాహుల్ ఇన్నింగ్స్‌ని నిలబెడుతూ వీరతాండవం ఆడేశాడు. ఈ క్రమంలో ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఘనతను రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. 62 బంతుల్లో కెఎల్ రాహుల్ 101 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించి.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చేసి బాస్ డే లీడే బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో వైపు శ్రేయస్ మాత్రం నెదర్లాండ్స్‌కి ఊపిరి ఆడనివ్వకుండా ఫోర్లు, సిక్సర్స్‌తో కదంతొక్కాడు. మొత్తం 94 బంతులు ఆడిన శ్రేయస్ 10 ఫోర్లు, 5 సిక్సర్స్‌తో 128 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇన్నింగ్స్ చివరి బంతి ఆడిన సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ క్రికెట్ జట్టు కెరీర్‌లో రెండో అత్యంత భారీ స్కోర్ (410)ను సాధించింది.