రెండు పడవల మీద కాళ్లేయకూడదని పెద్దవాళ్లు ఎప్పటి నుంచో అంటున్నారు. అది ఎప్పటికైనా డేంజర్ అని ఆ మాట చెబుతున్నారు. అన్ని పుస్తకాల సారాన్ని కాచి వడబోసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఈ విషయం తెలియనిది కాదు. గత ఎన్నికల సమయంలో పవన్‌లో ఆవేశం తప్ప ఆలోచన ఉండదని అనేవారు. కానీ 2024 ఎన్నికల సమయానికి ఆయన రాటుదేలిపోయారు. ఈ విషయం వారాహి యాత్రలలో చేసిన ప్రసంగాలను విన్న ఎవరికైనా అర్థమవుతుంది. కుల సంఘాలను కలుపుకుని ఆయన ముందుకు సాగుతున్న విధానాన్ని పరిశీలించి అధికార పార్టీల నేతలు సైతం అవాక్కవుతున్నారు.
ఈ తరుణంలో ఇలాంటి స్టెప్పా?
అయితే ఆయన కాస్త ఏదైనా ఒక రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెడితే బాగుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తమకు ఏపీ ముఖ్యమనుకున్న టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు. కానీ జనసేన ఏకంగా తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన తరుణంలో ఈ స్టెప్పేంటని అంతా అవాక్కయ్యారు. పైగా ఏపీ విషయానికి వస్తే.. అక్కడ టీడీపీతో పొత్తులో ఉంది. బీజేపీ ఈ పొత్తుపై ఇంతవరకూ స్పందించిన పాపాన పోవడం లేదు. పైగా ఏపీ సీఎం జగన్‌కు ఫుల్ సపోర్ట్‌గా బీజేపీ ఉందని టాక్.
ఓటమి పాలైతే ఏంటి పరిస్థితి?
తెలంగాణలో ఎన్నికల విషయంలో పవన్ అయోమయానికి ఆయన మళ్ళీ అయోమయానికి గురై ప్రజలకు, పార్టీ శ్రేణులను కూడా అయోమయపరుస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీలో ఈ రెండు పార్టీలు తెగదెంపులేమీ చేసుకోలేదు కాబట్టి తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైతే ఏంటి పరిస్థితి? ఆ ఎఫెక్ట్ ఏపీ మీద పడదని గ్యారెంటీ ఏమైనా ఉందా? అలా ఒకవేళ అయ్యిందంటే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పరిస్థితేంటి? ఇవన్నీ ఒకదానితో మరొకటి లింక్ అయి ఉన్న విషయాలు. అటు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు మేనిఫెస్టో రూపకల్పనలో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో జనసేన పూర్తి స్థాయిలో దృష్టి ఏపీపై పెట్టకుండా ఇలా రెండు పడవలపై కాళ్లేయడమేంటని జనంలో కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి బీజేపీ తెలంగాణలో ఓటమి పాలైనా జాతీయ పార్టీ కాబట్టి దానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ జనసేన మాత్రం తీవ్రంగా నష్టపోతుంది.