తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు అయితే ముగిసింది. నవంబర్-10 చివరిరోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే 2,321 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,795 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే చివరి రోజైన శుక్రవారం కాంగ్రెస్, బీజేపీల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలు చివరి వరకూ కొన్ని స్థానాలను హోల్డ్ చేయడం, ఇంకొన్ని స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులకు కాకుండా వేరొక అభ్యర్థికి బీఫామ్ ఇవ్వడం వంటివి చేశాయి. అన్ని పార్టీల్లోనూ రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్స్‌గా నామినేషన్ వేయడం జరిగింది.
రెబల్స్‌ను కట్టడి చేసే స్థాయిలో మార్పా?
ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎప్పుడూ కాంగ్రెస్ నుంచి బీభత్సంగా రెబల్ అభ్యర్థులు ఉంటారు. ఈసారి మాత్రం ఈ పార్టీ నుంచి చాలా తక్కువ మంది రెబల్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంతలోనే ఎంత తేడా? గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పు వచ్చింది. కానీ రెబల్స్‌ను కట్టడి చేసే స్థాయిలో మార్పు వచ్చిందని అయితే ఎవరూ ఊహించలేదు. ఎన్నికల సమయంలో టికెట్ రాకుంటే గతంలో ఈ పార్టీ వాళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీనియర్స్ అంతా కూడా చాలా తగ్గారు. ఇప్పుడు కొద్దిమంది రెబల్స్‌గా బరిలో దిగినా.. వారిని అనునయించేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. వారు కూడా రాజీనామాలు ఉపసంహరించుకున్నారో కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగుండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అభ్యర్థి ఒకరు.. బీఫామ్ మరొకరికి..!
119 స్థానాలకు గానూ.. ఒక స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకు కేటాయించగా.. 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సంగారెడ్డి, వేములవాడలో ప్రకటించిన వారికి కాకుండా వేరే వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చారు. అభ్యర్థుల జాబితాలో ఈ సారి కాంగ్రెస్ పార్టీ పలు మార్పులు అయితే చేసింది. వనపర్తి అభ్యర్థిగా చిన్నారెడ్డిని ప్రకటించి ఆ తరువాత బీఫామ్ మేఘారెడ్డికి ఇచ్చింది. పటాన్‌చెరులోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. తొలుత నీలం మధుకు టికెట్ ప్రకటించి బీఫామ్ మాత్రం కాటా శ్రీనివాస్ గౌడ్‌కు ఇచ్చింది. అలాగే తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌ను పక్కనబెట్టేసింది. అయితే తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ఆయన ప్రకటించడం గమనార్హం. మొత్తానికి తమ అనుచరులకు టికెట్ ఇవ్వకుంటే సహించబోమంటూ హెచ్చరించిన కీలక నేతలు సైతం ఆ తరువాత సైలెంట్ అయిపోవడం గమనార్హం.