సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి ప్రముఖులెందరో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటు. వారి స్పూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారు. కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారు. తెలుగు వెండితెర తొలితరం కథానాయకుడైన చంద్రమోహన్ మృతికి నా సంతాపం, శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - తెలంగాణ సీఎం కేసీఆర్
పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. -కె రాఘవేంద్ర రావు
ప్రముఖ నటులు శ్రీ చంద్ర మోహన్ గారు కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంలో నానావలిగా గుర్తుండిపోతారు. శ్రీ చంద్ర మోహన్ గారితో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో నటించారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో మంచి పాత్ర పోషించారు. తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలుంటాయి. 900కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చేరువయ్యారు. శ్రీ చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. - పవన్ కళ్యాణ్
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను. - జూనియర్ ఎన్టీఆర్