సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రమోహన్ (#ChandraMohan) మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదిత్య 369 చిత్రంలో చంద్రమోహన్ గారు తెనాలి రామకృష్ణ కవిగా పోషించిన పాత్ర మరపురానిదని, ఆయన లేని లోటు తీరనిదని అన్నారు బాలకృష్ణ.
తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, సంపూర్ణ నటుడు చంద్రమోహన్ గారు పరమపదించడం ఎంతో విషాదకరం. చంద్రమోహన్ గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు. సాంఘిక, పౌరాణిక పాత్రల పోషణలో ఆయన మేటి. చంద్రమోహన్ గారు, నాన్న గారితో కలసి యుగపురుషుడు, నిండుదంపతులు, ధనమా? దైవమా? ఇలా ఎన్నో చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు.
ఆయనతో కలసి ఎన్నో చిత్రాలలో పని చేయడం గొప్ప అనుభూతి. ఆదిత్య 369 చిత్రంలో చంద్రమోహన్ గారు తెనాలి రామకృష్ణ కవిగా పోషించిన పాత్ర మరపురానిది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిది. ఆయన ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చంద్రమోహన్ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.. అని చంద్రమోహన్‌కు నివాళులు అర్పించారు.