సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రమోహన్ (#ChandraMohan) మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. చంద్రమోహన్ సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేశారు.
సిరిసిరిమువ్వ, శంకరాభరణం, రాధాకళ్యాణం, నాకూ పెళ్ళాం కావాలి లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథానాయకులు చంద్రమోహన్‌గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.
నా తొలి చిత్రం ప్రాణం ఖరీదులో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.
ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.. అని చిరంజీవి ఎక్స్ మాధ్యమం ద్వారా నివాళులు అర్పించారు.