తెలంగాణ ఎన్నికల ప్రకటన ఏ ముహూర్తాన వచ్చిందో కానీ అప్పటి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి అన్నీ అపశకునాలు ఎదురవుతున్నాయి. అసలే సెంటిమెంటు ప్రకారం.. ముహూర్తం చూసుకుని కానీ సీఎం కేసీఆర్ ఏ పనీ చేయరు. అలాంటి కేసీఆర్‌కు ఒకటో రెండో అయితే అనుకోవచ్చు కానీ వరుసబెట్టి అపశకునాలు ఎదురవుతున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఆయన రాజసూయ యాగం చేసి మరీ ఎలక్షన్ బరిలోకి దిగారు. అయినా కూడా ఈ అపశకునాలేంటి? ఇవన్నీ మంచికా.. చెడుకా? అపశకునాలు మంచికి ఎలా అవుతాయంటారా? అయితే సీఎం కేసీఆర్ అసలే ప్రచారానికి కాస్త గ్యాప్ అయితే తీసుకున్నారు. ఈ లోపు ఏదైనా యాగం చేస్తారేమో చూడాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
మళ్లీ మళ్లీ ఎందుకిలా?
మంచిగా ఎన్నికల ప్రచారానికి వెళదామని హెలికాఫ్టర్‌లో బయలుదేరారు సీఎం కేసీఆర్. సగం దూరం వెళ్లారో లేదో.. హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఒక సురక్షిత ప్రదేశంలో హెలికాఫ్టర్‌ను ల్యాండింగ్ చేశారు. వెంటనే ఏవియేషన్ అధికారులు మరో హెలికాఫ్టర్‌ను కేసీఆర్ కోసం సిద్ధం చేశారు. ఆ తరువాత మళ్లీ రెండో సారి కూడా అదే సమస్య తలెత్తింది. ఎలాంటి ప్రమాదమైతే జరగలేదు కానీ మళ్లీ మళ్లీ ఎందుకిలా? అది చాలదన్నట్టు.. నిన్నటికి నిన్న మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తూ ఉండగా.. వాహనాన్ని సడెన్ బ్రేక్ వేయడంతో ఆయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. పోనీలే ఆయన క్షేమంగా ఉన్నారని పార్టీ నేతలంతా ఊపరి పీల్చుకున్నారు.
లేఖ రాసినా ప్రయోజనం లేదు..
ఇక తెలంగాణలో ప్రభుత్వోద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై ఫుల్ సీరియస్‌గా ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కనీసం డీఏ అయినా భారీగా ప్రకటిద్దామనుకుంది కేసీఆర్ సర్కార్. ఓ ప్రకటన కూడా మూడు నెలల క్రితమే చేసేసింది. అంతా బాగానే ఉంది.. ఇక ప్రకటిద్దాంలే అనుకుంటూ తాత్సారం చేసింది. ఈలోపు ఎన్నికల ప్రకటన ఆఘమేఘాల మీద రానే వచ్చింది. అంతే.. డీఏ ప్రకటనకు బ్రేక్ పడిపోయింది. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. అసలే అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ మాంచి కసి మీద ఉంది. అది చాలదన్నట్టు నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేవు. వచ్చినా కూడా అవకతవకల కారణంగా రద్దయ్యాయని మంట మీద ఉన్నారు. ఉద్యోగులను డీఏ ఇచ్చి చల్లబరుద్దామనుకుంటే ఆ ఆశ కూడా గోవిందా.. ఇక ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.