ఈ రాష్ట్రానికి మళ్లీ నేనే సీఎం కావాలి అనుకోవడంలో తప్పేం లేదు. ఈ పార్టీ అధినేత అయినా సరే.. ఒకసారి సీఎం కుర్చీలో కూర్చొన్నాక తిరిగి దిగిపోవాలని అనుకోరు. ప్రస్తుతం జగన్ కూడా అలాగే భావిస్తున్నారు. కానీ తను సీఎం అయ్యేందుకు అధికారులను వాడుకోవడమే ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ అనే కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి తన గురించి డప్పు కొట్టే బాధ్యతను అధికారులకు అప్పగించారు. నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి తన నామస్మరణ చేయాలంటూ ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తను చేపట్టిన కార్యక్రమంతో ఓ బ్రోచర్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ బ్రోచర్ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ముగుస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ఏపీకి జగనే ఎందుకు సీఎం కావాలనేది ప్రధాన ప్రశ్న.
కొటేషన్లన్నీ వాడేసి మరీ..
ప్రజాధనాన్ని ప్రచారాలకు వినియోగించుకుంటున్న జగన్.. ఏం చేశారని తిరిగి ఆయనే సీఎం కావాలనేది మిలియన్ డాలర్ ప్రశ్న. పోలవరం ప్రాజెక్టును కాస్త నీటి నిల్వ బ్యారేజ్‌గా మార్చినందుకా? కృష్ణ జలాల విషయంలో కానీ.. ప్రత్యేక హోదా విషయంలో కానీ కేంద్రాన్ని ప్రశ్నించకుండా సాగిల పడుతున్నందుకా? ఎందుకు తిరిగి ఆయనే సీఎంగా ఉండాలి? మేధావులు, మహానుభావులందరి కొటేషన్లనూ వాడేసి తన గొప్పతనాన్ని ఊరూ వాడ చాటేస్తున్నారు. మహిళలు, దళితులు జగన్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వృద్ధులనేది కూడా చూడకుండా మహిళలపై కేసులు పెట్టి వేధించారు. ఇది చాలదన్నట్టు మహిళలపై వైసీపీ నేతల వేధింపులు. కేవలం సంక్షేమ పథకాల ద్వారా జనాన్ని గ్రిప్‌లో పెట్టుకోవాలన్న తపన తప్ప అభివృద్ధి ఊసే లేదు.
జగన్ ప్రభుత్వం ఒక్కటే చేస్తోందా?
పోనీ ప్రభుత్వోద్యోగులు ఏమైనా సంతోషంగా ఉన్నారా? అంటే అదీ లేదు. కనీసం సమయానికి జీతాలు పడక నానా తంటాలు పడుతున్నారు. ఇక నిరుద్యోగులకు పోస్టులు విడుదల చేసేదే లేదు. మెగా డీఎస్సీ ఊసే లేదు. అమరావతే రాజధాని అంటూ అదికారంలోకి వచ్చి మూడు రాజధానులు అంటూ షో చేసి కనీసం ఏపీకి రాజధాని అనేదే లేకుండా చేశారు. సంపూర్ణ మద్య నిషేధమని.. చివరకు తమ పేర్లతోనే బ్రాండ్‌లను రిలీజ్ చేసిన ఘనత కూడా జగన్‌దే. పైగా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి స్వప్రయోజనాల కోసం వారిని వాడుకుంటున్నారు. ముఖ్యంగా వీరి చేత వైసీపీ సానుభూతిపరుల ఓట్లు మిస్సవకుండా.. పైగా ఒక్కొక్కరికి 3 ఓట్లు ఉండేలా చేయడం.. అలాగే టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలిగించడమనేది చేయిస్తున్నారు. ఇక పింఛన్లు, ఆర్థిక సాయం, ఆరోగ్య సంరక్షణ అంటారా? అది జగన్ ప్రభుత్వం ఒక్కటే చేస్తున్నది కాదు.. ఏ ప్రభుత్వమైనా చేసేదే. పైగా ఇవేమీ జగన్ ప్రవేశ పెట్టినవి కాదు. గత ప్రభుత్వం ప్రవేశపెడితే వాటినే ఆయన కంటిన్యూ చేస్తున్నారు. మొత్తంగా జగన్ చేపట్టిన కార్యక్రమంతోనే విపక్షాలు ఆయన్ను ఏకి పారేస్తున్నాయి.