తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సీఎం కావాలని కేసీఆర్ తహతహలాడుతుంటే.. 2024 ఎన్నికల్లో గెలిచి ఏపీకి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆరాటపడుతున్నారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. మరోసారి సీఎం కావడం. ఎవరైనా సరే.. ఒకసారి సీఎం పీఠాన్ని అధీష్టించిన తర్వాత దాన్ని వదులుకోవాలని అనుకోరు. దీనిలో తప్పేమీ లేదు కానీ ఏపీ సీఎంగా జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే.. కేసీఆర్‌కు ఉపయోగం. అలాగే కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తేనే జగన్‌కు ఉపయోగం. ఇద్దరికీ ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. ఒకరికి గెలుపు మరొకరికి ఆనందాన్నివ్వడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆది నుంచి కేసీఆర్, జగన్‌లు ఒక్కటే.
ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబే..
ఇద్దరూ చక్కగా కలిసి మెలిసి ఉండేవారు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉంటే చాలు.. పరిశ్రమలన్నీ వరుసగా తెలంగాణకు క్యూ కడతాయి. కాబట్టి తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తుంది. అంతేకాకుండా ఏపీ సర్వనాశనం అయినా కూడా కృష్ణాగోదావరి జలాల పంపకాలపై జగన్ ప్రభుత్వం నోరు మెదపదు. కనుక కేసీఆర్ యథేచ్ఛగా ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణకు నీళ్లు తరలించుకోవచ్చు. ఇక జగన్ సీఎంగా ఉంటేనే తెలంగాణ ప్రగతిని హైలైట్ చేసుకునేందుకు కేసీఆర్‌కు అవకాశం దక్కుతుంది. అక్కడి అధోగతిని చూపించుకుని ఇక్కడ కేసీఆర్ తన గొప్పతనాన్ని చాటుకుంటూ ఉంటారు. అలాగే ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడే. ఆయనను అణగదొక్కడమే ఇద్దరి ఏకైక లక్ష్యం.
కాస్త తగ్గి ఉంటున్న కేసీఆర్..
ఈ ప్రయోజనాలన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉంటే, ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడుతుంటారు. ఇక కేంద్రం విషయానికి వచ్చినా కూడా ఇప్పుడంటే జగన్ కేసులన్నింటికీ కేంద్రం అండగా ఉంటోంది కానీ తరువాత ఈ పరిస్థితి ఇలాగే ఉండాలని లేదు. జనసేనతో బీజేపీ జత కడుతోంది కాబట్టి భవిష్యత్తులో జగన్‌కు హ్యాండ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరోవైపు బీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పాలని కలలు కంటోంది. ఏదో కేసీఆర్ తన కూతరు కవిత కోసం కేంద్రానికి కాస్త తగ్గి ఉంటున్నారు కానీ అవకాశం వస్తే ఎదురు తిరుగుతారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 70-100 మంది ఎంపీలను సమకూర్చుకోగలిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఉమ్మడిగా ఎదుర్కోవచ్చు. కాబట్టి జగన్, కేసీఆర్ ఒకరి గెలుపు కోసం మరొకరు శ్రమిస్తారనడంలో సందేహమే లేదు.