రాజకీయాల్లో పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో అది కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. పార్టీ ప్రకటించిన అభ్యర్థి చేతికే బీఫామ్ ఇస్తారన్న నమ్మకం అయితే ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి రూల్స్ మారిపోయాయి. గెలుపు గుర్రాలకే టికెట్, బీఫామ్.. సీనియర్లకు ప్రధాన్యం లేదు అని టాక్ అయితే వచ్చింది. దాదాపు టికెట్ కేటాయించడంలో ఇదే ఫార్ములాను పార్టీ అధిష్టానం ఫాలో అయ్యింది. కానీ తాజాగా మరోసారి పార్టీ ఫ్లిప్ అవుతోంది. దీనికి కారణం కీలక నేతలు ఎంటరై టికెట్ కేటాయింపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే.
రెండు వర్గాలుగా చీలిన పార్టీ..
తాజాగా తెలంగాణలో పఠాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి విషయమై పార్టీలో కాకరేగుతోంది. తొలుత పఠాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధుని పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆది నుంచి అక్కడి టికెట్ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇదంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే చేశారంటూ ధర్నాలు నిర్వహించి ఆయన ఇంటిని ముట్టడించారు. ఆ వెంటనే పార్టీ రెండు వర్గాలుగా చీలి పోయింది. ఎన్నడూ లేనిది కేవలం ఒక్క పఠాన్‌చెరు అభ్యర్థి విషయంలో జరిగిన ధర్నాకు ఏకంగా గాంధీ భవన్‌కు తాళాలు వేయాల్సి వచ్చిందంటే.. ఆ అంశం ఎంత తీవ్ర రూపం దాల్చిందో అర్థమవుతోంది.
ఇస్తారా? ఇవ్వరా?..
ఇక కాటా శ్రీనివాస్‌కు మాజీ మంత్రి దామోదర రాజనరసింహ అండగా నిలిచారు. అలాగే నీలం మధుకు జగ్గారెడ్డి సపోర్టుగా నిలిచారు. మధుకు బీఫామ్ ఇవ్వకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో బీఫామ్ తీసుకునేందుకు గాంధీ భవన్‌కు వచ్చిన నీలం మధుకి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. అసలు ఇస్తారా? ఇవ్వరా? కూడా తెలియడం లేదు. నిజానికి నీలం మధుకి బీఫామ్ ఇచ్చి ఉంటే బుధవారమే నామినేషన్ వేయాల్సి ఉంది కానీ తిరిగి ఈ నెల 10న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిస్థితి కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది. ఇద్దరు కీలక నేతలకు చేరొక పక్షాన చేరడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరింది. ఇక చూడాలి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..