తెలంగాణ సీఎం కేసీఆర్.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేయాలని తహతహలాడుతున్నారు. అయితే తెలంగాణలో పరిస్థితులు మునుపటి మాదిరిగా లేవు. గతానికి ఇప్పుడు భిన్నంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. బీఆర్ఎస్‌కు సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి కేసీఆర్ గట్టి పోటీని అయితే ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా కేసీఆర్‌పై పోటీకి సిద్ధమయ్యారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌కి పోటీగా రేవంత్ బరిలోకి దిగుతున్నారు. నిజానికి రేవంత్ అత్యంత బలమైన శత్రువు. మాటకు మాట సమాధానం చెప్పగలరు. ఆ మాత్రానికే గెలుస్తారా? అంటే అవకాశం ఉంది.
ఫోకస్ పెట్టిన అగ్రనేతలు..
తెలంగాణ ఇచ్చిన పార్టీగా జనంలో కాంగ్రెస్‌కు మంచి పేరే ఉంది. అయితే దాన్ని ఉపయోగించుకోవడంలో గతంలో కాంగ్రెస్ నేతలు ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని గట్టిగా జనాల్లోకి తీసుకెళుతున్నారు. నేతలంతా ఒక తాటిపైకి వచ్చి మరీ విజయం కోసం పోరాడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఆటోమేటిక్‌గా పెరిగాయి. రేపు కేసీఆర్‌పై రేవంత్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చివరకు తమ పార్టీ అధిష్టానానికి సైతం రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని అయితే ఇచ్చారు. దీంతో పార్టీ అగ్ర నేతలంతా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. కాబట్టి రేవంత్‌ను అయితే తక్కువ అంచనా వేయలేము.
ఇద్దరూ అవమానం పాలైన వారే..
ఇక బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నం తాము చేస్తోంది. కేసీఆర్‌తో కలిసి ఉద్యమాలు చేసి.. ఆయన మంత్రివర్గంలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి కేసీఆర్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఆయనను ఓడించేందుకు కేసీఆర్ శతవిధాలుగా యత్నించారు. కొన్ని నెలలపాటు మంత్రులందరినీ మోహరించినా ఫలితం దక్కలేదు. ఈటల విజయం సాధించారు. ఇప్పుడు కేసీఆర్‌కే పోటీగా గజ్వేల్ బరిలో దిగారు. కేసీఆర్ చేతిలో అటు రేవంత్.. ఇటు ఈటల ఇద్దరూ అవమానపాలైన వారే. అవమానం తాలూకు దెబ్బ మనసుపై చాలా గట్టిగానే ఉంటుంది. ఇద్దరూ కేసీఆర్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక చూడాలి కేసీఆర్ ఇద్దరినీ ఓడిస్తారో లేదంటే.. తానే ఓటమి పాలవుతారో. మొత్తానికి ఈ ఎన్నికలు కేసీఆర్‌కు అయితే ఇజ్జత్ కా సవాలే.