సీఎం జగన్ మాట మాట్లాడితే.. వైనాట్ 175 అంటూ ఊదరగొడుతున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. 175 స్థానాలు పక్కనబెడితే ఆ స్థానాలన్నింటిలో నిలిచేందుకు అభ్యర్థులున్నారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం అదే. ఇక ఎంపీ స్థానాలైతే సరేసరి. కొన్ని చోట్ల తాము పోటీ చేయలేమని వైసీపీ నేతలు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కనీసం కొత్తవారు కూడా పోటీకి విముఖత చూపిస్తుండటం విశేషం. 2019లో 25కి 22 సీట్లను గెలుపొందిన వైసీపీకి... మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతుండగా అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సిటింగ్ ఎంపీలు సైతం తాము అసెంబ్లీకి పోటీ చేస్తామని భీష్మించుకుని కూర్చొంటున్నారు.
కొత్త అభ్యర్థి కోసం సెర్చింగ్..
అసెంబ్లీకి వెళతామంటున్న ఎంపీల్లో చిత్తూరు, కాకినాడ, బాపట్ల, అమలాపురం, అనకాపల్లి, అరకు, విశాఖ ఎంపీలు ఉన్నారు. ఏడు స్థానాల్లో పోటీకి కొత్తవారిని దింపాలి. అయితే విశాఖ నుంచి విజయసాయిరెడ్డి బరిలోకి దిగుతారనుకున్నారు కానీ ఆ తరువాత దానికి సంబంధించిన న్యూసేం లేదు. శ్రీకాకుళం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం వైసీపీ సెర్చింగ్ మొదలు పెట్టింది. ఇక విజయనగరంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎంపీ బెల్లాన తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని పట్టుబట్టారు. అయితే అసెంబ్లీ సాధ్యపడదని అధిష్టానం చెప్పడంతో అయిష్టంగానే బరిలోకి దిగనున్నారని టాక్. నెల్లూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కర్నూలు ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నారట.
ఆయన మౌనం వహిస్తున్నారట..
ఇక నెల్లూరు ఎంపీ స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాంను పోటీ చేయాలని అధిష్టానం చెబుతోందట. కానీ దీనికి ఆయన మౌనం వహిస్తున్నారట. నరసాపురం ఎంపీ రఘుురామ కృష్ణరాజు స్థానంలో గోకరాజు గంగరాజును బరిలోకి దింపాలని భావించినా ఆయన యాక్టివ్‌గా లేరు. అలాగే ఏలూరు ఎంపీ సైతం ససేమిరా అంటున్నారట. ఇక దాదాపు రాష్ట్రం మొత్తం పరిస్థితి అలాగే ఉంది. ఎంపీ సంగతేమో అంతా అసెంబ్లీకి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. వారందరి చేత అసెంబ్లీకి పోటీ చేయిస్తే మరి అప్పటికే ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల మాటేంటి? వారు అంగీకరిస్తారా? నిరాశకు లోనై ఎదురు తిరిగితే అసలుకే ఎసరొస్తుంది. మొత్తానికి వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది. ఇక చూడాలి వైసీపీ అధిష్టానం ఏం చేస్తుందో.. ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో..