తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల హాట్ టాపిక్ అవుతున్నారు. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకని.. పార్టీని రద్దు చేసుకున్నా వైసీపీ నేతలు పెద్దగా ఫీలయ్యేవారు కారేమో కానీ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడమే వారికి ఇబ్బందికరంగా మారింది. సీన్‌లోకి వైఎస్ విజయమ్మను కూడా తీసుకొచ్చి లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారు. నిజానికి ప్రస్తుత తరుణంలో షర్మిల తీసుకున్న నిర్ణయం సమంజసమే. ఆ పార్టీ పోటీ చేసినా కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. పోటీ చేసి ఇజ్జత్ పోగొట్టుకోవడం కంటే తప్పుకుని ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం మేలని షర్మిల భావించినట్టున్నారు.
ఏతల్లైనా కొడుకు పక్షమే కానీ..
అయితే షర్మిల నిర్ణయం తీసుకోబోయే ముందు ఆమె తల్లి విజయమ్మతో చర్చించి ఉండకపోవడమేనది అయితే జరగదు. తనకు అండగా నిలచిన తల్లిని పక్కనబెట్టేసి షర్మిల సొంత నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. షర్మిల ఏదో తప్పడటుగు వేసిందని.. దానికి విజయమ్మ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ వైసీపీ అనుకూల మీడియా గగ్గోలు పెడుతోంది. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం వెనుక ఎంతటి బలమైన కారణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఏ తల్లి అయినా సరే కొడుకు పక్షమే వహిస్తుంది. కానీ కొడుకుని కాదని.. కూతురు పక్షం విజయమ్మ వహించారంటేనే కొడుకుపై ఆమెకెంత అసహనం ఏర్పడిందోననే టాక్ లేకపోలేదు.
మద్దతు ఇచ్చిన కార్యకర్తలు..
అయితే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఆమె పోటీకి దిగకపోవడం మాత్రం ఆ పార్టీ నేతలకు కొంత ఆగ్రహం తెప్పించిన మాట వాస్తవం. తెలంగాణలో 3 వేల కిలోమీటర్ల మీద షర్మిల పర్యటించడం.. దీక్షలు చేయడం.. వంటి వాటన్నింటికీ ఆ పార్టీ కార్యకర్తలు బాగా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేయాలని భావించారు. దీనికోసం చర్చలు కూడా జరిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ విలీనానికి అంగీకరించలేదు. ఇక దీంతో ఒంటరిగా పోటీ చేయాలని భావించి.. టికెట్ ఆశావహుల నుంచి అప్లికేషన్స్ సైతం తీసుకున్నారు. ఇది తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ అప్లికేషన్స్ తీసుకుని పోటీ చేయడం లేదని ప్రకటించడం పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సీనియర్ లీడర్ గట్టు రామచంద్రరావు తదితరులు ఆంధ్రాకు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.