బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదని పార్టీ అధిష్టానం తేల్చేసింది. ఇప్పటి వరకూ అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పార్టీ ముఖ్య నేతలు.. ఇంకా చెప్పాలంటే గవర్నర్‌లుగా పని చేసిన వారసులను సైతం పక్కనబెట్టేసింది. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తన కుమారుడికి వేములవాడ స్థానం.. అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కూతురుకు ముషీరాబాద్ స్థానాన్ని కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. కానీ అధిష్టానం అవేమీ పట్టించుకోవలేదు. వేములవాడ స్థానాన్ని తుల ఉమకు, ముషీరాబాద్‌ను పూస రాజుకు కేటాయించింది. మరి ఏ ఒక్కరి వారసులకు కూడా స్థానం కల్పించలేదా? అంటే ఒకరిద్దరికి మాత్రం కల్పించింది.
బండి, ఈటల మధ్య ఆధిపత్య పోరు..
అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేసింది. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి వచ్చే తన కుమారుడి భవిష్యత్ కోసం దేనికైనా సిద్ధమని ఇటీవల చెప్పారు. అంటే పార్టీ మారడానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి పాలమూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఇక పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరుకు సైతం చెక్ పెట్టేసింది. గత కొంతకాలంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య బీభత్సంగా పోరు జరుగుతోంది. ఇటీవలి కాలంలో అది పీక్స్‌కు వెళ్లిపోయిందని సమాచారం. ఎవరి అనుచరులకు వాళ్లు టికెట్ ఇప్పించుకోవాలని పట్టుబట్టుకుని కూర్చొన్నారు. అధిష్టానం మాత్రం ఇద్దరి సమన్వయం చేయడంలో సక్సెస్ అయ్యింది.
హుస్నాబాద్ కోసం పట్టుబట్టిన ఈటల..
ముఖ్యంగా వేములవాడ, హుస్నాబాద్ స్థానాల కోసం బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. వేములవాడను వికాస్‌రావుకు కేటాయించాలని బండి పట్టుబట్టారు. కానీ అధిష్టానం మాత్రం ఆ స్థానాన్ని ఈటల అనుచరురాలైన తుల ఉమకు కేటాయించింది. అలాగే హుస్నాబాద్ స్థానాన్ని తన అనుచరుడు సురేందర్ రెడ్డికి కేటాయించాలని ఈటల రాజేందర్ పట్టుబట్టారు. అయితే ఆ స్థానాన్ని బండి సంజయ్ అనుచరుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించి సమన్వయం చేసింది. మొత్తానికి ఇద్దరికీ సమన్యాయం చేసి ఆధిపత్య పోరుకు అధిష్టానం చెక్ పెట్టింది. ఈసారి మాత్రం బీజేపీ అధిష్టానం చాలా తెలివిగా ఆధిపత్య పోరుతో పాటు వారసత్వ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.