ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సీటు కింద నీళ్లు రాబోతున్నాయా? ఏపీలో టీడీపీలో ప్రక్షాళన ప్రారంభమైందా? టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదా? అంటే ఔననే సమాధానమే వినవస్తోంది. ఆయన పెద్దగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించింది లేదు. పెద్దగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది లేదు. అసలు ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన నాటి నుంచే ఆయన పదవికి ఎసరొచ్చిందని టాక్. అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్య చేయడం.. విపక్షాలు దానిని పెద్ద ఎత్తున ట్రోల్ చేశాయి.
పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వెనుకేసుకు రావాలి తప్ప అనుచిత వ్యాఖ్యలైతే చేయకూడదు కానీ అచ్చెన్నాయుడు ఫ్రస్టేషన్‌లో ఏదో చేసేశారు. దానిని ఎవరో వీడియో తీసి వైరల్ చేసేశారు. అప్పుడే ఆయనను పదవి నుంచి తొలగిస్తారని టాక్ నడిచింది. కానీ అదేమీ జరగలేదు. ఇప్పుడు మరోసారి ఈ టాక్ నడుస్తోంది. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో అధ్యక్షుడిగా తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది గిట్టని వారి పనేనని కొందరు అంటున్నారు. అచ్చెన్నాయుడు అంటే ఆది నుంచి కూడా వైసీపీ నేతలకు పడదు. ఈ తరుణంలోనే ఇలాంటి లేని పోని రూమర్స్ సృష్టించి పార్టీకి అచ్చెన్నాయుడికి మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని అంటున్నారు.
నిజానికి అచ్చెన్నాయుడి అధ్యక్ష పదవిపై కొంతమంది సీనియర్లు సైతం అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల సమయంలో బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని ఎందుకు తొలగిస్తారని అలాంటిదేం జరగదని మరికొందరు అంటున్నారు. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీసీల ఓట్లను రాబట్టుకునే పనిలో పార్టీలన్నీ ఉన్నాయి. ఈ తరుణంలో అచ్చెన్నాయుడిని తొలగించే సాహసం చేయరని కొందరు అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అచ్చెన్నాయడు స్థానంలో యనమల రాహకృష్ణుడిని అధ్యక్షుడిగా చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందంటూ టాక్ నడుస్తోంది. యనమల కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో వచ్చే ఇబ్బంది కూడా ఏముండదని అంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..