ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే.. గులాబీ బాస్ కేసీఆర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సీఎం అవుతారా?. ఒకవేళ కేసీఆర్ హ్యాట్రిక్ కొడితే మాత్రం దక్షిణాదిలో ఇది అతి పెద్ద హిస్టరీ అవుతుంది. అత్యంత రేర్ ఫీట్ సాధించిన సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. నిజానికి దాదాపు డబుల్ హ్యాట్రిక్ సాధించిన సీఎంలు ఉత్తరాదిలో అయితే ఉన్నారు కానీ దక్షిణాదిలో మాత్రం ఇప్పటి వరకూ ఏ నేతకూ ఇది సాధ్యపడలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిందో కేసీఆర్ చరిత్రకెక్కడం ఖాయం.
ఇప్పటి వరకూ ఇలా!!
సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్.. 24 ఏళ్లకు పైగా సీఎం పదవిలో ఉన్నారు. ఇంకో ఆరేళ్లు ఉండి ఉంటే.. డబుల్ హ్యాట్రిక్ సాధించి ఉండేవారు. అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 23 ఏళ్లు, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు 23 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు. అయితే దక్షిణాదిలో కూడా మూడు సార్లు సీఎంలు అయిన వాళ్లు ఉన్నారు కానీ వరుసగా మూడు సార్లు అయిన వాళ్లు మాత్రం లేరు. ఇక వరుసగా రెండు సార్లు సీఎంలు అయిన వాళ్లైతే కేసీఆర్‌తో పాటు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారు ఉన్నారు.
అయ్యే పనేనా!
తమిళనాట కూడా ముగ్గురు ఇలా వరుసగా రెండు సార్లు సీఎం పదవిని అలంకరించిన వాళ్లు ఉన్నారు. జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీలు సైతం వరుసగా రెండు సార్లు మాత్రమే సీఎంలు అయ్యారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగానే కృషి చేస్తోంది. మరి జనం మనసులో ఏముంది? తిరిగి బీఆర్ఎస్ అధికారాన్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయ్యింది కాబట్టి ఆ పార్టీకి ఏమైనా అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.