తెలంగాణలో ఎన్నడూ చూడని.. ఆసక్తికర పరిణామాలు ఈ సారి ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్‌గా విపక్షాలన్నీ గేమ్ మొదలు పెట్టాయి. గతంలో ఏనాడూ లేని విధంగా పార్టీల కీలక నేతలు కేసీఆర్‌పై పోటీకి మొగ్గు చూపుతున్నారు. ఈ సారి కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానమైన గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీకి ఒక చోట బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢీకొనడానికి సిద్ధమైపోయారు. దీనికి సంబంధించిన ప్రకటన నిన్న రానే వచ్చింది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
సీఎం పీఠం దక్కకుండా పోతుంది కదా?
అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ రేవంత్‌ను పక్కా స్కెచ్ వేసి మరీ ఓడించింది. మరి అలాంటిది ఇప్పుడు ఏకంగా కేసీఆర్‌ను ఢీకొని రేవంత్ ఎలా గెలుస్తారు? అసలు ఏ ధైర్యంతో ఆయన పోటీలో నిలుస్తున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ అయితే పదే పదే బీఆర్ఎస్, కేసీఆర్‌లను ఓడిస్తామని చెబుతూ వస్తున్నారు. అసలు ఆయన ఇంతలా విర్రవీగడానికి కారణమేంటి? ఒకవేళ కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలైతే.. ఇప్పటి వరకూ కాంగ్రెస్ గెలిస్తే రేవంతే సీఎం అనుకున్నారు. మరి ఓడితే సీఎం పీఠం దక్కకుండా పోతుంది కదా? ఇవన్నీ తెలియకుండానే రేవంత్ బరిలోకి దిగుతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆయనది ఆత్మవిశ్వాసమనుకోవాలా? లేదంటే అహంకారమా? అని జనాల్లో చర్చ జరుగుతోంది.
అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్‌కు ఉందా?
కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న చేరికలు రేవంత్‌ను ఇలాంటి సాహసానికి పురిగొల్పుతున్నాయా? అనే డౌటానుమానం కూడా రాక మానదు. అసలు అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్‌కు ఉందా? అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా కేసీఆర్‌ను ఢీకొందామనుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ పోటీ చేస్తున్న స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు టాక్ నడుస్తోంది. నేడో రేపో రేవంత్ నామినేషన్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొడంగల్ ఘటనే తిరిగి రిపీట్ అయితే పరిస్థితి ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే కామారెడ్డితో పాటు కొడంగల్‌లో కూడా రేవంత్ పోటీకి దిగుతారని తెలుస్తోంది. రేవంత్ నిజంగా కేసీఆర్‌ను ఓడించగలరా.. లేదా? అనేది చూడాలి.