కదిలినా.. మెదిలినా కేసు.. వార్డుల చొప్పున మూసేస్తున్న వైసీపీ..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటుంది. జనం మెప్పు పొందేందుకు యత్నిస్తుంది. కానీ ఏపీలో సీన్ రివర్స్. అధికార వైసీపీ స్టైలే వేరు. వలంటీర్లను వాడుకుని విపక్ష సానుభూతిపరుల ఓట్లపై వేటు వేయడం.. విపక్షం కదిలినా.. మెదిలినా కేసులు వేయడం. ఇదే కొద్ది రోజులుగా జరుగుతోంది. నీచమన్నా.. అన్యాయన్నా ఏమన్నా సరే.. మేము చేసేది ఇదే అన్నట్టుగా ఉంది సీఎం జగన్ వైఖరి. ఎంతసేపూ ఎలా భయపెడదామా? ఏ విధంగా కేసుల వేయవచ్చు? అనే దానిపైనే జగన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. అసలు ఈ స్థాయిలో కేసులు ఎందుకు పెడుతున్నారనే దానిపై జనంలో అయితే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పోలింగ్ బూతు వైజ్‌గా కేసులు..
విపక్షం అంటే చాలు కేసు నమోదు చేస్తున్నారు. దీనికి జగన్ ముందు చూపే కారణమని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. ఒక వ్యక్తిపై క్రిమినల్ కేసు ఉంటే అతను పోలింగ్ ఏజెంట్‌గా పనికిరాడు. కాబట్టి దీని కోసమే.. కనిపించిన విపక్ష సానుభూతిపరులందరిపై వైసీపీ తన అధికారాన్ని అడ్డు పెట్టకుని కేసులు నమోదు చేయిస్తోంది. దీని కోసం పోలింగ్ బూత్ వైజుగా అధికార పార్టీ కేసులు నమోదు చేయిస్తోందట. బూతుకు 50 నుంచి 60 మంది ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేయిస్తోందని సమాచారం. ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలు తప్ప వైసీపీ చేసిందేం లేదు. ఆ సంక్షేమంతో ఈ సారి ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని భావించిన వైసీపీ అధిష్టానం, అధికారం, పోలీసు బలంతో ఎన్నికల్లో విజయం సాధించాలని యోచిస్తోంది.
కేసులు పెట్టాలని భావించారో అంతే సంగతులు..
పోలింగ్ ఏజెంట్లు పంపించే వారి సంఖ్య గ్రామాల్లోగానీ, వార్డుల్లోగానీ పరిమితంగా ఉంటుంది. వారే ఇప్పుడు వైసీపీ టార్గెట్. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదయ్యాయంటే ఎంత పకడ్బంధీగా వైసీపీ ప్లాన్ చేస్తుందో అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునే వదల్లేదంటే.. సామాన్య కార్యకర్తలు ఒక లెక్కా? ఎక్కడికక్కడ తొక్కి పడేస్తోంది. ఇక తమ అక్రమాలపై కేసులు పెట్టాలని భావించారో ఇక అంతే సంగతులు. వారిపై ఏకంగా దాడులకు తెగబడుతోంది. పోలీసులు కూడా బాధితులపైనే కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. ఇక ఇది చాలదన్నట్టు ఇప్పటికే బోగస్ ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేయించేసినట్టు టాక్. గత ఎన్నికల్లోనూ వేరే రాష్ట్రాల నుంచి బస్సులు పెట్టి మరీ జనాన్ని రప్పించి వారితో ఓట్లు వేయించిన ఘటనలు వైసీపీ ఖాతాలో చాలా ఉన్నాయి. ఇప్పుడు పోలింగ్ బూత్‌లను కూడా గుప్పిటపడితే చాలు అధికారం సునాయాసంగా సొంతమవుతుంది.