తెలంగాణ సీఎం కేసీఆర్.. మాటల మాంత్రికుడు. తన మాటలతో తిమ్మిని బమ్మిని చేయగలరు. విపక్షాలు సైతం ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటాయి. ఇక జనమైతే చెవులు కోసుకుంటారు. చిన్న పిల్లలు సైతం కేసీఆర్ మాటలకు బాగా కనెక్ట్ అవుతారు. అసలు తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తున నడిచిందంటేనే కేసీఆర్ మాటల కారణంగా అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే కేసీఆర్ మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. మీమ్స్ కోసం.. ఫన్నీ వీడియోస్ కోసం కూడా కేసీఆర్ మాటలను బాగా వినియోగిస్తుంటారు. అలాంటి కేసీఆర్‌కు ఇప్పుడు ఏమైంది? ఆయన మాటల్లో పస లేదు. అసలు మాట్లాడుతున్నది కేసీఆరేనా? అన్న అనుమానం కూడా కలుగుతోంది
ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితమైతే ఎలా?
తనపై ఎలాంటి విమర్శలొచ్చినా.. ఆరోపణలు చేసినా కేవలం మాటలతో వాటన్నింటికీ సమాధానం చెప్పి జనాల మెదళ్ల నుంచి ఆ విమర్శలు, ఆరోపణలను తీసేయగలిగిన దిట్ట కేసీఆర్. మరి ఎన్నికల సమయంలో ఆయనను విపక్షాలు అంతలా విమర్శిస్తున్నా సమాధానమే లేదేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ ఎందుకో చప్పబడిపోయారంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రసంగాల్లో దూకుడు లేదు. అంతకు ముందులా సామెతలు లేవు. ఎన్నికల సమయంలో ఇప్పటి వరకూ అంటే పదేళ్లుగా అధికారంలో ఉండి చేసిన అభివృద్ధిని చెప్పాలి కానీ ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితమైతే ఎలా? అసలే బీఆర్ఎస్‌పై పీకల్లోతు అసహనంలో ఉన్న జనానికి ఆ విమర్శలు రుచిస్తాయా?
తానే తెలంగాణ తెచ్చానని చెబితే.. తెలంగాణ ఇచ్చిన పార్టీ అవతల స్ట్రాంగ్‌గానే ఉంది కదా. ఇప్పుడు ఈ విషయాన్ని జనాల్లోకి గట్టిగా తీసుకెళుతోంది కూడా. ఇలాంటి సమయంలో అరిగిపోయిన రికార్డ్‌నే తిప్పి తిప్పి వేస్తే ఎలా?
ఆంధ్రలో అలా.. ఇలా అంటూ ఏపీపై పడిపోతే ఎలా?
ఇప్పటి వరకూ విన్న మాటలనే తిరిగి తిరిగి చెబుతుంటే జనాల్లో కేసీఆర్ మాటల పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కేసీఆర్ ఏమాత్రం బీజేపీ జోలికి వెళ్లడం లేదు. టార్గెట్ అంతా కాంగ్రెసే. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోవడం నుంచి రోజుకో వార్త వస్తుంటే దానిపై నోరు మెదిపిన పాపాన పోవడం లేదు. ఆంధ్ర రోడ్లు.. ఆంధ్రలో అలా.. ఇలా అంటూ ఏపీపై పడిపోతే ఎలా? రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ చేసిందేమీ లేక చెప్పుకోవడం లేదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పైగా తనను ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటారట. తెలంగాణను మీరే కాపాడుకోవాలంటూ హితోక్తులు. మొత్తానికి కేసీఆర్ ఎందుకో భయంతో వెనుకడుగు వేస్తున్నట్టు అనిపిస్తోందని టాక్. మొత్తానికి కేసీఆర్ ప్రసంగం ఉసూరు మనిపించేదిలా ఉండటంతో ఆయన్ను ఆయనే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని అంతా భావిస్తున్నారు.