ఏపీలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమమైనా చేపడుతున్నాయి. ఇప్పటికే పొత్తులు కూడా ఫిక్స్ అయిపోయాయి. దీంతో వైసీపీ ఎప్పటి నుంచో జనంలో ఉండగా.. టీడీపీ, జనసేనలు సైతం జనంలోనే ఉంటున్నాయి. ఇక తాజాగా టీడీపీ కొత్తగా ఉచితాల ప్రచారాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాము ఇచ్చే ఉచితాల మీద టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్రీ అని పేర్కొంటూ మూడు సిలిండర్లను పట్టుకున్న ఉన్న పిక్‌ను ఈ సందర్భంగా ఆ పార్టీ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేస్తోంది.
వారిని ఆకట్టుకుంటే చాలు..
టీడీపీ పోస్టర్ అయితే జనాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఉచితాలు ఎంత మేరకు వర్కవుట్ అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ఎక్కువగా ఈ ఉచితాల పట్ల ఆకర్షితులు అవుతారనడంలో సందేహం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి వర్గమే ఎక్కువ. వారిని ఆకట్టుకుంటే చాలు. మధ్యతరగతి వర్గం అంటేనే నథింగ్ బట్ బీసీలు. ఇక ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా జనాభా పరంగా చూస్తే బీసీలే ఎక్కువ. వారిని ఆకట్టుకున్న వారిదే అధికారం. ఇప్పటి వరకూ ఎన్నికలు వచ్చాయంటే.. పార్టీలన్నీటి ఫోకస్ బీసీలపైనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. నూటికి అరవై శాతానికి పైగా ఏపీలో బీసీలున్నారని అంచనా.
అందుకే ఈ ఉచితాల కాన్సెప్ట్..
అయితే బీసీల ఓట్లన్నీ గంపగుత్తగా పడటం మాత్రం జరగదు. ఏ పార్టీ అయినా కేవలం మెజారిటీ ఓట్లను మాత్రం రాబట్టుకోగలుగుతుంది. ఇలా రాబట్టుకున్న పార్టీ మాత్రమే అధికార పీఠాన్ని దక్కించుకుంటుంది. అందుకే బీసీలకు ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ నానా తంటాలు పడుతుంటాయి. ఈ క్రమంలోనే వారిని దృష్టిలో పెట్టుకునే ఈ ఉచితాల కాన్సెప్ట్‌ను తీసుకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఉచితాలు, సంక్షేమ పథకాలు బాగానే వర్కవుట్ అవుతాయనడంలో అనుమానమే లేదు. ఈసారి టీడీపీ అదే పని చేస్తోంది. మరి వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ సంక్షేమానికి పెద్ద పీట వేసింది కదా అంటారా? వేసింది కానీ కేవలం సంక్షేమానికే. చంద్రబాబు వచ్చేసి అభివృద్ధికి పెద్ద పీట వేస్తారని అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఆయన సంక్షేమం స్లోగన్ కూడా ఎత్తుకుంటే టీడీపీకి చాలా ప్లస్ అవుతుందనడంలో సందేహమే లేదు.