క్రికెట్ వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 83 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనూ సౌతాఫ్రికాను భారత బౌలర్లు కోలుకోనివ్వలేదు. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు తీస్తే.. షమీ, కుల్‌దీప్ చెరో రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీసి.. సౌతాఫ్రికా ఓటమికి కారణమయ్యారు. సౌతాఫ్రికా జట్టులో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. జాన్‌సేన్ అత్యధికంగా 14 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 326 పరుగులు చేసింది. బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగితే.. రోహిత్ (40), శ్రేయస్ అయ్యర్ (77) ధీటైన బ్యాటింగ్‌కి తోడు చివరిలో రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్ భారత్ భారీ స్కోర్‌కు కారణమైంది. బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ జడేజా విజృంభించడంతో సౌతాఫ్రికా భారీ పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. ఫలితంగా సౌతాఫ్రికాపై భారత్ 243 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో 16 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్ రన్ రేట్ మరింత మెరుగుపడింది. ఈ ప్రపంచకప్‌లో మరే ఇతర జట్టు కూడా ఇలా వరుస విజయాలను అందుకోలేకపోయింది. భారత్‌కు ముందు పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టు.. ఇప్పుడు సెమీస్‌కు చేరడానికి కష్టపడాల్సిన పరిస్థితిని ఫేస్ చేస్తోంది. భారత్‌పై ఓడినప్పటికీ 12 పాయింట్స్‌తో దక్షిణాఫ్రికా జట్టు ముందే సెమిస్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. బర్త్‌డే రోజు అజేయ సెంచరీతో పాటు సచిన్ సెంచరీల రికార్డ్‌ను సమం చేసిన కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లీగ్‌లో భారత్ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో వచ్చే ఆదివారం ఆడనుంది.