ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాట్ టాపిక్‌గా మారారు. వైసీపీ నేతలు ఆయనను గతంలో పప్పు అంటూ అవహేళన చేశారు. అలాగే ఆయనను బాడీ షేమింగ్ చేశారు. అలాంటి నారా లోకేష్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారారు. బాగా స్లిమ్ అయిపోయి తనను హేళన చేసిన వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత పొలిటికల్‌గా కూడా బాగా స్ట్రాంగ్ అయ్యారు. యువగళం పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా వైసీపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు. కానీ తరువాత ఆయన జనంతో వ్యవహార శైలి చూసి వారు అడిగే ప్రశ్నలకు నారా లోకేష్ ఇస్తున్న సమాధానాలు చూసి అంతా షాక్ అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత దాదాపు ఢిల్లీలోనే..
ఇక చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ.. ఆ తరువాత తండ్రి కోసం ఢిల్లీకి వెళ్లడం.. న్యాయనిపుణులతో చర్చలు.. తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వచ్చిన సీఐడీ అధికారులతో నారా లోకేష్ డీల్ చేసిన విధానం అందరినీ నివ్వెరబోయేలా చేసింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత దాదాపు నారా లోకేష్ ఢిల్లీలోనే గడిపారు. ఏపీలో పార్టీ కార్యకలాపాలను చూసుకుంటూ.. పార్లమెంటులో పార్టీ వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేవారు. ఆ తరువాత న్యాయ నిపుణులతో కూడా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వచ్చారు. ఇక తాజాగా నారా లోకేష్ చేసిన పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. వైసీపీ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నారా లోకేష్ మాత్రం చాలా మారిపోయారు.
‘వ్యూహం’ వెనుక నారా లోకేష్..
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వెనుక ఆయన తనయుడు లోకేష్ ఉన్నాడనటంలో సందేహం లేదు. ఆయన న్యాయనిపుణులతో మాట్లాడటం.. వారిని కేసులో భాగస్వాములను చేయడం వల్లనే ఇది జరిగింది. అలాగే వ్యూహం సినిమా రిలీజన్‌ను ఎవ్వరూ అడ్డుకోలేరంటూ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ చిత్రంలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై అభ్యంతరం తెలిపింది . దీని వెనుక కూడా నారా లోకేషే ఉన్నారని సమాచారం. అలాగే రేపో మాపో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ను పొడిగించేందుకు కూడా నారా లోకేష్ కృషి చేస్తున్నారని సమాచారం. మొత్తానికి వైసీపీ నేతలకు లోకేష్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారనడంలో సందేహం లేదు.