వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నిన్న మొన్నటి వరకూ చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు. రాజన్న రాజ్యం తెస్తాం. దళిత ద్రోహి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటూ నానా హంగామా చేశారు. రాజన్న బిడ్డను గెలిపించాలంటూ పదే పదే చెప్పారు. సీన్ కట్ చేస్తే.. నిన్న అసలు తమ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని చెప్పి షాక్ ఇచ్చారు షర్మిల. ముందైతే కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనానికి పావులు కదిపారు. పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ అయి చర్చలు నడిపారు. ఆ తరువాత తూచ్.. ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతున్నామని షర్మిల తెలిపారు. అభ్యర్థుల పరిశీలన తదితర పనులు సైతం లైన్‌లో పెట్టారు. ఇంతలోనే ఇదేంటని అంతా విస్తుబోతున్నారు.
పాదయాత్ర చేసినా ప్రయోజనం లేదు..
కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలొద్దు.. తద్వారా గులాబీ బాస్‌ను ఓడించాలన్న ఒకే ఒక్క కారణంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న మీడియా సమావేశంలో షర్మిల తెలిపారు. అయితే షర్మిల వెనక్కి తగ్గడం వెనుక లోగుట్టు మరొకటి ఉందంటున్నారు. నిజానికి షర్మిలను తెలంగాణ బిడ్డగా జనాలు చూడలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమె పాదయాత్ర చేసినా మరొకటి చేసినా జనం కానీ.. రాజకీయ పార్టీలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఆమె గురించి మాట్లాడేందుకు సైతం ఎవరూ యత్నించలేదు. ఒకవేళ షర్మిల పార్టీ ఎన్నికల బరిలో దిగినా కూడా ఒకటి అర సీట్లు రావడం కూడా కష్టమే. ఇది గ్రహించే కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేసేందుకు యత్నించారు. అది కూడా జరగలేదు.
రాజ్యసభకు పంపిస్తారా?
నిన్నటికి నిన్న కాంగ్రెస్‌కు మద్దతిస్తామని షర్మిల ప్రకటించడం అందరినీ విస్తుబోయేలా చేసింది. అసలు తెరవెనుక ఏం జరిగి ఉంటుందనే టాక్ మొదలైంది. ఐతే షర్మిల రాజకీయ భవిష్యత్తుపై గట్టి హామీ తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. అయితే.. కేవలం రాజ్యసభ సభ్యత్వంతోనే సరిపెడతారా? లేదంటే మరేమైనా మేలు చేస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ తెలంగాణలో పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే.. తమ పార్టీలోని ముగ్గురు కీలక వ్యక్తులకు పదవులు పదవులు కావాలని కోరుతారట. ఆ ముగ్గురిలో వైఎస్ విజయమ్మ కూడా ఉండవచ్చని టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందనేది ఎన్నికలు అయిపోతే కానీ తెలియదు.