పదేళ్లుగా జగన్ అక్రమాస్తుల కేసులో పురోగతి లేదని.. కాబట్టి కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌తో పాటు సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ కేసులకు సంబంధించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ నిర్వహించింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇంత జాప్యం ఎందుకు జరగుతోంది? కారణాలు చెప్పాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది.
విచారణకు అంతం లేదు..
పదేళ్లుగా నత్తనడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఎన్ని కేసులు నమోదు చేసింది? ఆ కేసులన్నీ ఇప్పటి వరకూ ఎన్ని వేల సార్లు వాయిదా పడ్డాయనేది గణాంకాలతో సహా రఘురామ తన పిటిషన్‌లో వివరించారు. అసలు వీటి విచారణ త్వరగా జరపాలని కానీ.. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలన్న ఉద్దేశం కానీ సీబీఐలో కనిపించడం లేదని పేర్కొన్నారు. జగన్‌కు ఇష్టానుసారం కేసుల్లో వాయిదా కోరే స్వేచ్ఛను ఇవ్వడంతో విచారణకు అంతమనేదే లేకుండా పోయిందని రఘురామ పేర్కొన్నారు. ఇప్పట్లో కేసుల విచారణ ప్రారంభయ్యే సూచనలేమీ కనిపించడం లేదు కాబట్టి సుప్రీంకోర్టు కల్పించుకుని కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కోరారు.
ఆయనెందుకు పిటిషన్ వేశారు?
అయితే రఘురామ పిటిషన్‌పై సుప్రీం పలు ప్రశ్నలు సంధించింది. అసలు జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు సంబంధమేంటని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించారు. ఈకేసులో రఘురామ ఫిర్యాదుదారు కానీ.. బాధితుడు కానీ కానప్పుడు ఆయనెందుకు పిటిషన్ వేశారని అడిగింది. ఫిర్యాదుదారు కాకున్నా పిటిషన్ దాఖలు చేయవచ్చని రఘురామ తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపినా కూడా తిరిగి మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. రఘురామ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తా? అని కోర్డు అడిగితే.. వైసీపీ ఎంపీనే అని న్యాయవాది సుప్రీంకు తెలిపారు. కాగా.. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. అలాగే ప్రతివాదులందరికీ సుప్రీం నోటీసులు జారీ చేసింది.