తెలంగాణలో బీజేపీ ఉవ్వెత్తున ఎగిసిందన్నా.. ఒక్కసారిగా నేలమట్టమైందన్నా కారణం ఆ పార్టీ నేత బండి సంజయ్. ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తరువాత బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నంత రేంజ్‌కి పార్టీ వెళ్లిపోయింది. ఆ తరువాత బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించిన తరువాత దారుణాతి దారుణంగా పతనమైంది. చిన్న ఘటన ఏదైనా జరిగితే బండి సంజయ్ అక్కడ క్షణాల్లో వాలిపోయేవారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేవారు. మరి ఆయనను అధిష్టానం కావాలని తప్పించిందో మరొకటో కానీ ఆ పదవిలోకి కిషన్ రెడ్డిని తీసుకొచ్చింది. అంతే బీజేపీ మొదటికొచ్చింది. ఇప్పుడు బండి సంజయ్‌కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.
ప్రత్యేకంగా హెలికాఫ్టర్..
ఇక ఇప్పుడు తెలంగాణ విషయంలో చేసిన తప్పిదాన్ని బీజేపీ అధిష్టానం గ్రహించిందో ఏమో కానీ తిరిగి బండి సంజయ్‌ను కీలకంగా మార్చేసింది. ఎన్నికల పగ్గాలను ఆయన చేతికి అప్పగించింది. అంతేకాదు.. ఆయనకు ప్రత్యేకంగా ఓ హెలికాఫ్టర్‌ను కేటాయించింది. తెలంగాణవ్యాప్తంగా బండి సంజయ్‌కు గట్టి పట్టు ఉండడం.. ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేయడంలో సంజయ్ దిట్ట కావడంతో.. కేసీఆర్‌ను ఎదుర్కోగలిగిన సత్తా ఆయనకే ఉందని భావించారో ఏమో కానీ ప్రచార బాధ్యతలను ఆయనకు అధిష్టానం కట్టబెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి జాప్యం లేకుండా పర్యటించేందుకు వీలుగా హెలికాఫ్టర్‌ను కేటాయించింది.
ప్రత్యర్థిగా మారడం అసాధ్యం..
అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు బీజేపీ అధిష్టానం చేసిందదేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పతనం అంచుకు చేరాక ఇప్పుడున్న కాస్త వ్యవధిలో ఏం చేసినా కూడా పైకి తీసుకురావడం చాలా కష్టం. అటు బీభత్సంగా పుంజుకున్నా కాంగ్రెస్‌ను వెనక్కు లాగి బీఆర్ఎస్‌కు ప్రత్యర్థిగా మారడమనేది అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఇక మీదట రాష్ట్రమంతా కూడా హెలికాఫ్టర్‌లో పర్యటించనున్నారు. ఇక చూడాలి ఇంత ఆలస్యంగా బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కారణంగా కాస్తైనా మేలు జరుగుతుందో లేదో..