నిజమే.. తెలంగాణతో పోలిస్తే అభివృద్ధిలో ఏపీ ఎక్కడో అట్టడుగున ఉంది. ఒకవేళ మరోసారి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది కానీ జనం కోరి మరీ జగన్మోహన్‌రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన కలియుగ భస్మాసురిడిలా మారి ఏపీ నెత్తిన చేయి పెట్టారు. కలియుగ భస్మాసురుడు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అప్పట్లో భస్మాసురుడికి పెద్దగా తెలివి లేదు. మోహిని మాయలో పడి తన నెత్తిన తనే చేయి పెట్టుకున్నాడు. కానీ జగన్ మాత్రం చాలా తెలివితో ఉన్నారు. బై మిస్టేక్ కూడా తన నెత్తిన చేయి పెట్టుకోరు. అడ్డొచ్చిన వారి నెత్తిన అలాగే రాష్ట్రం నెత్తిన చేయి పెట్టారు. అంతే రాష్ట్రమంతా భస్మం.
సింగిల్ రోడ్డుంటే ఏపీ..
అమరావతి అంటూ చంద్రబాబు ఓ అద్భుతాన్ని సృష్టించబోయారు కానీ జగన్ దాన్ని రాళ్లు రాప్పలతో కూడిన బీడులా మార్చేశారు. మూడు రాజధానులంటూ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. తాజాగా ఓ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ ఇజ్జత్ మొత్తం అంగట్లో పెట్టేశారు. ఏపీ సరిహద్దులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. తెలంగాణను ఏపీతో పోల్చారు. డబుల్ రోడ్లు ఉంటే తెలంగాణ అని సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అని తేల్చేశారు. ఏపీ రోడ్ల పరిస్థితిపై అదిరిపోయే సెటైర్లు పేల్చారు. అక్కడి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకు కట్టారు. అసలు మౌలిక సదుపాయాల విషయంలో ఏపీ పూర్తిగా వెనుకబడి పోయిందని కేసీఆర్ చెప్పారు.
వైసీపీ నేతలు దులిపేసుకుంటారట..
ఏపీ నుంచి రైతులు తెలంగాణకు వచ్చి ధాన్య అమ్ముకుంటున్నారని.. కనీసం అక్కడి ప్రభుత్వం ధాన్యం సేకరణ కూడా చేయలేకపోతోందని హేళన చేశారు. అలాగే తెలంగాణలో కరెంటు పోదని.. ఏపీలో కరెంటే ఉండదన్నట్టుగా చెప్పారు. గతంలో రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ రాకపోతే అమరావతి లాగే హైదరాబాద్ అవుతుందని
హెచ్చరించారు. అంటే అమరావతి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కేసీఆర్ స్పష్టంగానే చెప్పారు. మరి కేసీఆర్ ఇంత దారుణంగా ఏపీని అవమానిస్తే అక్కడి వైసీపీ నేతలు ఏం చేస్తారంటారా? మహా అయితే విమర్శించి దులిపేసుకుంటారని ఇప్పటికే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.