"రాజు వెడలే రవి తేజము లలరగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగా.." అంటూ ఒక రాజు వెళుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది అప్పట్లో ఓ కవి వర్ణించడం జరిగింది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం.. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది మొదలు అభిమాన గణం ఆయనకు అడుగడునా తోడు నిలిచింది. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్డు వెంట ఆయన కాన్వాయ్ అలా రోడ్డు వెంట వెళుతుంటే మరోసారి ‘రాజు వెడలే’ అన్న పలుకులు గుర్తొచ్చాయి. అభిమానులు ఆయనకు నీరాజనం పలికారు.
హోరెత్తిన నినాదాలు..
52 రోజుల తర్వాత వచ్చిన తమ అభిమాన నేతను చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.20 నిముషాలకు చంద్రబాబు బేగంపేటకు చేరుకున్నారు. ఆయన చేరుకోవడానికి ముందే పెద్ద ఎత్తున అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు కనిపించగానే అభిమానుల నినాదాలతో బేగంపేట విమానాశ్రయం ‘మేము సైతం బాబు కోసం’, ‘జై సీబీఎన్’ నినాదాలతో హోరెత్తింది. చంద్రబాబు పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా ఒకటుంది.
నాటి రోజులను గుర్తుకు తెచ్చిన ర్యాలీ..
బేగంపేట నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటి ముందుగా చంద్రబాబు తన నివాసానికి వెళ్లారు. కేసీఆర్ ఇంటి సమీపంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ పెద్ద ర్యాలీ కేసీఆర్ నివాసం ముందుగా చంద్రబాబు అనుకూల నినాదాలు చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ఆ సీన్ ఒకప్పుడు తెలంగాణ మిలియన్‌ను తలపించింది. ఆ స్థాయిలో లేకున్నా కూడా అలా ర్యాలీ సాగడం మాత్రం ఒకసారి నాటి రోజులను గుర్తుకు తెచ్చింది. అడుగడుగునా వాహన శ్రేణిపై పూల వర్షం కురిసింది. సాయంత్రం 5:20కి ప్రారంభమైన చంద్రబాబు ర్యాలీ ఆయన నివాసానికి చేరుకునేసరికి రాత్రి 8:30 అయ్యింది. ఇక చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మధుసూదన్‌రావు, రాజగోపాల్ తదితరులు ఉన్నారు.