తెలంగాణలో ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న పార్టీ.. టీడీపీ. ఈ పార్టీ కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కంటే ఏపీ కీలకంగా మారింది. ఏపీలో అధికారాన్ని దక్కించుకోవడంపైనే టీడీపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. తెలంగాణలో పోటీ చేయడం లేదని టీడీపీ ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల చూపు ఆ పార్టీ కేడర్‌పై పడింది. ముఖ్యంగా తెలంగాణలో కమ్మ సామాజిక వర్గమంతా దాదాపు టీడీపీకే అనుకూలంగా ఉంటుంది. ఇక టీడీపీ మద్దతుదార్లు ఎలాగూ ఉండనే ఉన్నారు. దీంతో టీడీపీ కేడర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలన్నీ పడ్డాయి. ఎలాగైనా వారిని తమవైపు తిప్పుకోవాలని యత్నిస్తున్నాయి.
టీడీపీకి అనుకూల వ్యాఖ్యలు..
ఇక టీడీపీ అయితే పోటీ చేయడంలేదు సరే.. మరి టీడీపీ మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు మనిషి అనే అంటారు. అలాగే టీడీపీ మద్దతుదారులు సైతం రేవంత్‌కు సపోర్టుగా నిలుస్తారనడంలో సందేహం లేదు. అయితే కొద్ది రోజులుగా మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా టీడీపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించవద్దన్న మంత్రి కేటీఆరే తిరిగి అరెస్ట్‌ను ఖండించడంతో పాటు కేటీఆర్ సైతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాధను తన బాధగా భావిస్తూ మాట్లాడారు.
టీడీపీ కండువా కప్పుకుని మరీ..
చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వడంతో ఖమ్మంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కూడా వెళ్లి తన మద్దతు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం ఏకంగా టీడీపీ కండువా కప్పుకుని నానా హంగామా చేశారు. ఇక టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఎవరి వైపు చూస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో జనసేనతో టీడీపీ పొత్తులో ఉంది. తెలంగాణలో జనసేన కూడా పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లో ఆ పార్టీకి అండగా నిలుస్తారనుకున్నా.. మిగిలిన చోట్ల ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మాత్రం టీడీపీ కార్యకర్తలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.