టీడీపీ, జనసేన మేనిఫెస్టో విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి దసరాకు మేనిఫెస్టోను తీసుకొస్తామని టీడీపీ అప్పట్లో చెప్పింది. ఆ తరువాత రాజమండ్రిలో జరిగిన సమన్వయ కమిలీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. మరి నేడు ఆ ఊసే లేదు. అసలేం జరుగుతోందని అధికార పక్షంలో క్యూరియాసిటీ ప్రారంభమైంది. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసి జనంలోకి వెళతామన్న నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రజానీకం సహనమా? వైసీపీ నేతల సహనమా?
అయితే గత మహానాడులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు దసరాకు మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత చంద్రబాబు అరెస్ట్ కావడం, టీడీపీ, జనసేన పొత్తు చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత నవంబర్ 1న మేనిఫెస్టో అని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. ఆ ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఈ రెండు పార్టీల నేతలేమో కానీ వైసీపీ నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. రాకపోయేసరికి బాగా డిజప్పాయింట్ అయినట్టున్నారు. అంతే.. ప్రజానీకం సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అసలు ప్రజానీకం సహనమా? వైసీపీ నేతల సహనాన్ని పరీక్షిస్తున్నారని పరోక్షంగా విమర్శిస్తున్నారా? అనేది తెలియడం లేదు.
విపక్షం ఆలోచించడంలో తప్పేముంది?
గతంలో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మేనిఫెస్టో విడుదల చేస్తే.. నానా రచ్చ చేశారు. దానిలో సంక్షేమ పథకాలు ఉన్నాయంటూ గోల చేశారు. వైసీపీని విమర్శించి తిరిగి సంక్షేమ పథకాలతోనే సూపర్ సిక్స్ ఏంటంటూ విమర్శలు గుప్పించారు. మరి ఐదేళ్లలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వైసీపీ ఏమీ సాధించలేనప్పుడు ప్రజా సంక్షేమం గురించి విపక్షం ఆలోచించడంలో తప్పేముంది? ఇక ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేయడం లేదంటూ నస. అసలు వైసీపీ మేనిఫెస్టో చూసుకోక.. ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయడం లేదని గగ్గోలేంటి? వారి స్ట్రాటజీలు వారికి ఉంటాయి కదా. అటు పవన్ కల్యాణ్ తన కుటుంబంలో వివాహం నిమిత్తం ఇటలీ వెళ్లారు. కుటుంబాన్ని ఆయన గాలికి వదిలేయలేరు కదా. ఇక నారా లోకేష్ తన తండ్రి కేసులపై ఢిల్లీ వెళ్లారు. సమయం, సందర్భం చూసుకుని విడుదల చేస్తారు. దీనిపై వైసీపీ నేతలు ఇంతలా విమర్శలు చేయడంపై జనం సైతం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.