టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 50 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ లభించినప్పటి నుంచే టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఆయనను చూడాలని టీడీపీ శ్రేణులన్నీ అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా రోడ్డెక్కాయి. గజమాలతో సత్కరించడం.. రోడ్డుపైనే కొబ్బరి కాయలు కొట్టి ఘన స్వాగతం పలకడం వంటివి చేశారు. ఇక చంద్రబాబు రాక గురించి తెలిసిన వెంటనే ఉండవల్లి పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారిపోయాయి. జనసంద్రంతో నిండిపోయాయి.
ధైర్యంగా ఉండండి..
బాణ సంచాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఉండవల్లిలో టీడీపీ శ్రేణులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇక చంద్రబాబు ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్విఘ్నభరితంగా మారిపోయింది. చంద్రబాబును చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. వారిని అలా చూసి చంద్రబాబు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఆ తరువాత తనపై ఎన్ని కేసులు పెట్టినా ఏమీ చేయలేరని.. ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. మొత్తానికి చంద్రబాబు రాకతో ఉండవల్లి ప్రజానీకం ఫుల్ ఖుషీ అయిపోయింది.
నేతలను, కార్యకర్తలను కలవరు..
ఇక చంద్రబాబు ఇంటికి చేరుకున్న వెంటనే సతీమణి భువనేశ్వరితో కలిసి పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే నేటి మధ్యాహ్నం వరకూ విశ్రాంతి తీసుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరుతారని సమాచారం. నిజానికి ఆయన తొలుత తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం హైదరాబాద్ వెళ్లాలని భావించారు. కానీ అనారోగ్య సమస్యలకు వెంటనే చికిత్స అవసరముండటంతో తిరుమల పర్యటనను వాయిదా వేసుకుని నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు అయితే పార్టీ నేతలను కానీ కార్యకర్తలను కానీ కలవరని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.